Visakhapatnam G-20 Summit updates: రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాలో మార్చి 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జి–20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సదస్సుకు నలభై దేశాల నుంచి దాదాపు రెండు వందల మంది ప్రతినిధులు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు.. వైద్య శాఖ మంత్రి విడదల రజిని, ఐటీశాఖ మంత్రి అమర్నాథ్, పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు తెలిపారు. అంతేకాకుండా, మూడు రోజులపాటు జరిగే సదస్సులో ఏయే రోజున ఏయే కార్యక్రమాలు చేపట్టనున్నారో ఆ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేశారు.
జి-20 సదస్సుకు 2500 మంది సిబ్బంది నియామకం: ఈ క్రమంలో విశాఖ నగరంలో జరగబోతున్న జి-20 సన్నాహక సదస్సు విజయవంతానికి భద్రతలో భాగంగా 2500 మంది సిబ్బందిని నియమించినట్లు.. నగర పోలీసు కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రతినిధులు తొలిరోజు రాడిసన్ బ్లూ హోటల్, కైలాసగిరి, వీఎంఆర్డీఏ పార్కు, ఆర్కేబీచ్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారించి.. 28, 29 తేదీల్లో రాడిసన్ బ్లూహోటల్లో జరిగే సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఈనెల 30న వర్క్ షాప్ అనంతరం పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన పలు ప్రాజెక్టులైన కాపులుప్పాడ ఎనర్జీప్లాంట్, మాధవధార 24x7 నీటి పథకం తదితర వాటిని సందర్శిస్తారన్నారు.
సదస్సు వద్ద గట్టి నిఘా ఏర్పాటు: ఈ సదస్సు భద్రతకు.. 1850 మంది పోలీసులు, 400 మంది ఎ.ఆర్ పోలీసులు, 4 గ్రేహౌండ్స్ యూనిట్లు, 2 క్యూఆర్టీ బృందాలు, 6 స్పెషల్ పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లటూన్లతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో భాగంగా గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. జి-20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో రూట్ బందోబస్తులతో పాటు వీఐపీలు ప్రయాణించే మార్గాల్లోనూ, సదస్సు వద్ద పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అతిథులు తిరిగే ప్రాంతాల్లోనూ, సదస్సు జరిగే ప్రాంగణం, బస చేసే హోటళ్ల వద్ద తాత్కాలిక రెడ్ జోన్‌ను ప్రకటించి.. డ్రోన్ల కార్యకలాపాలను నిషేధించామన్నారు.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలి: ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో విమానాశ్రయం రహదారి, రాడిసన్ బ్లూ హోటల్, బీచ్ రోడ్డు, సందర్శనీయ ప్రాంతాల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలన్నారు. స్వాగత ఏర్పాట్లతో పాటు విదేశీ అతిథులకు కల్పించిన భద్రతా సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. అతిథులు సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో 24 గంటల ముందు నుంచి పర్యాటకుల అనుమతులు ఉండవన్నారు. కేవలం జి-20 ప్రతినిధులు, అతిథులు ప్రయాణించే సమయంలోనే తప్ప మరే ఇతర ఆంక్షలు ఉండవని, తమకున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 59 మంది విదేశీ ప్రతినిధులు రాగా.. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయన్నారు. విమానాశ్రయం, తాటిచెట్లపాలెం, వేమనమందిరం, సిరిపురం, సీఆర్ రెడ్డి సర్కిల్, కురుపాం సర్కిల్, రాడిసన్ బ్లూ వరకు ప్రజలు, వాహనదారులు నగర పోలీసులకు సహకరించి, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంపిక చేసుకోవాలని గర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ సూచించారు.
జి-20 సదస్సు కార్యక్రమాలు ఇలా.. ఈ నెల 28, 29, 30వ తేదీలలో జరగబోయే జి-20 సదస్సు కార్యక్రమాలను అధికారులు వెల్లడించారు. ''28వ తేదీ ఉదయం రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రధాన సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత 3.30 గంటల నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు జరుగుతాయి. అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అదే హోటల్ సమీపంలో ఉన్న బీచ్‌లో డిన్నర్ ఉంటుంది. ఈ డిన్నర్‌కి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారు. ఇక, రెండవ రోజు 29న హోటల్ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణులచే అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అల్పాహారం అనంతరం రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం జరుగుతుంది. సదస్సు చివరి రోజున 30వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 1.30 గంటల వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ ఉంటుంది. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుంది.''
ఇవీ చదవండి