మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండోరోజు విచారణ పూర్తి చేశారు. గతనెల 15న వివేకా హత్య జరిగిన సమయంలో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసు కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతిచ్చింది.
పలు కోణాల్లో విచారణ
వివేకా మృతదేహం వద్ద రక్తపు మరకలు ఎందుకు తుడిచి వేయాల్సి వచ్చింది.... ఎవరి ఆదేశాల మేరకు సాక్ష్యాలు తారుమారు చేశారనే కోణంలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పీఏ కృష్ణారెడ్డికి... వివేకా రాసినట్లుగా లభ్యమైన లేఖ ఉదయం దొరికితే సాయంత్రం వరకూ ఎందుకు పోలీసులకు ఇవ్వలేదని కోణంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరి ప్రోద్బలంతో లేఖను ఆలస్యంగా పోలీసులకు ఇచ్చారు అనే కోణంపై పోలీసులు ఆరా తీశారు. ముగ్గురు సిట్ అధికారులు.. నిందితులను విడివిడిగా ప్రత్యేక గదిలోకి పిలిచి ప్రశ్నించారు. వివేకాతో భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా అని ఎర్రగంగిరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.
ఇవీ చూడండి.