Bail granted to TDP leader Pattabhi: గన్నవరం ఘటనలో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి కేంద్ర కారాగారానికి ఆయనను తరలించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గత వారం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పట్టాభి తరఫున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదుల వాదనలు ముగియడంతో శుక్రవారం సాయంత్రం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. 25 వేల రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతి గురువారం న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి సత్యానంద్ షరతులు విధించారు.
గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి, మరో 12 మందిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై మరో కేసు దాఖలైంది. వాదనలు విన్న న్యాయమూర్తి రెండింట్లోనూ బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు పట్టాభిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ గన్నవరం పోలీసులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చారు. శనివారం రాజమహేంద్రవరం జైలు నుంచి పట్టాభి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం..
సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు ..: గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభితో పాటు అనేక మందిపై కేసులు పెట్టారు. పట్టాభి గన్నవరం రావడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడికి పాల్పడేలా రెచ్చగొట్టారని సీఐ కనకారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు పెట్టారు. ప్రధానంగా తనపై దాడి చేసి ప్రాణహాని తలపెట్టారని కనకారావు ఫిర్యాదు మేరకు పట్టాభి (ఏ-1)తో పాటు చిన్నా ఏ-2 గాను మరో 12 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వంశీ ముఖ్య అనుచరుడు కూడా ఫిర్యాదు..: సీఐ కనకారావుతో పాటు వంశీ ముఖ్య అనుచరుడు సీమయ్య ఫిర్యాదు మేరకు పట్టాభితో సహా 13 మందిపై ఐపీసీ సెక్షన్లు 147, 143, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కోర్టులో రిమాండ్ నివేదికను సమర్పించారు. దాంతో గన్నవరం కోర్టు పట్టాభి మరో 13 మందిని 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించింది. అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లారు. ఇప్పుడు టీడీపీ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం పట్టాభి సహా 13 మంది నేతలకు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
చేయి వాచిపోయేలా కొట్టారన్న పట్టాభి..: గన్నవరం జైలులోకి వెళ్ళే సమయంలో చేయి వాచిపోయేలా తనను కొట్టారంటూ పట్టాభి ఆరోపించారు. రిమాండ్ ఉండగా ముగ్గురు ముసుగు వేసుకున్న వ్యక్తులు కొట్టారని పట్టాభి అందరికీ చేతులు చూపించారు. అదేసమయంలో విజయవాడలో తన భర్తకు పోలీసుల నుంచీ ప్రాణహాని ఉందని పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు బాగా హింసించారని చెప్పారు. మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే తన భర్తకు ఏదైనా ప్రాణ హాని జరిగితే డీజీపీ ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు.
టీడీపీ అనుచరులకు అండగా వెళితే..: ఫిబ్రవరి మూడో వారంలో గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పట్టాభి అక్కడకు వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించడాన్ని గన్నవరం టీడీపీ నేత దొంతు చిన్న ఖండించారు. ఇది సహించని వంశీ అనుచరులు దొంతు చిన్న ఇంటిపై దాడి చేసి ఆయన గృహంలోని సామాన్లను ధ్వంసం చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై దొంతు చిన్నా ఫిర్యాదు చేయడానికి వెళ్లి న సమయంలో వైసీపీ కార్యకర్తలు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడికి ఉపక్రమించారు. ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలకు సంఘీభావంగా వెళితే తనను అడ్డుకోవడమే కాకుండా అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి