YSRCP Reddy Leaders Discrimination on Dalith MLAs : "వైఎస్సార్సీపీ రెడ్ల పార్టీ" అని నేను అన్న మాట కాదండీ బాబు సాక్షాత్తు మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్న మాటలు. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. వారి వ్యాఖ్యలను నిజం చేసే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల తీరు ఉంది.
మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలం : తిరుపతి జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని మారుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రిని కలిసినట్లు బయటకు చెబుతున్నా, అంతర్గతంగా రానున్న ఎన్నికల్లో సీటు విషయమై అడిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో పనులన్నీ మంత్రి చెప్పినట్లుగానే చేసినట్లు ఇటీవల వైఎస్సార్సీపీ పెద్దల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను తెలియ జేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన మంత్రిని కలిసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
దళితులంటే చిన్న చూపు - సీఎం జగన్పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు
దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా : ఇప్పటికే "దళిత ఎమ్మెల్యేలు అంటే జగన్కు చిన్న చూపా, దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా. పాపమా అదే మా కర్మా" అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇటీవలే బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో దళిత ఎమ్మెల్యే మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నువ్వా సరే సరే నేను మళ్లీ ఫోన్‌లో మాట్లాడతాలే : టికెట్ విషయంలో తనకు అన్యాయం జరుగుతోందని న్యాయం చేయాలని కోరేందుకు వచ్చిన అనంతపురం మడకశిర నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సజ్జలతో మాట్లాడేందుకు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి సచివాలయానికి వచ్చారు. సజ్జల బయటకు వెళుతున్న సమయంలో సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఆయన్ను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు.
తమ ఎమ్మెల్యే ఉంటేనే మడకశిరలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని, సర్వేల పేరుతో ఎవరినో తెచ్చి అక్కడ పెట్టవద్దు అంటూ నినాదాలు చేశారు. "తిప్పేస్వామికి అన్యాయం జరగదు. ఇబ్బంది లేకుండా చూస్తాం" అని చెప్పి సజ్జల కారు ఎక్కి బయల్దేరబోయారు. కార్యకర్తల తోపులాటకు దూరంగా వెళ్లి నిల్చున్న తిప్పేస్వామి, ఓ పోలీసు అధికారి సహాయంతో సజ్జల కారు వద్దకు చేరుకున్నారు. సార్ ఎమ్మెల్యే అని ఆ పోలీసు అధికారి చెప్పగా సజ్జల కారులో నుంచే ఎమ్మెల్యే వైపు చూశారు. సార్ అంటూ తిప్పేస్వామి వంగి నమస్కారం చేస్తూ ఏదో చెప్పబోగా "నువ్వా సరే సరే నేను మళ్లీ ఫోన్‌లో మాట్లాడతాలే" అంటూ సజ్జల వెళ్లిపోయారు. తిప్పేస్వామి నిస్సహాయంగా వెనుదిరిగారు.
ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల ఆవేదన : టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు సచివాలయంలో సజ్జలను కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉంటే వాటిలో మాదిగలకు 8 మాత్రమే కేటాయించారని వారు వాపోయారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఇతర ప్రతినిధులు ఉన్నారు.