YSRCP MLA Followers Attack On TDP Leader: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతపై వైసీపీ నాయకులు దాడికి తెగబడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమస్య పరిష్కారానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్తున్న మునిరత్నం నాయుడుపై.. వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేయడం దారుణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఓటమి భయంతోనే చెవిరెడ్డి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మునిరత్నాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం కొసమెరుపు.
దాడి చేసేది ఆ పార్టీ కార్యకర్తలే.. గాయపడి చికిత్స పొందుతున్న బాధితున్ని పరామర్శించేదీ ఆ పార్టీ నేతలే. ఇదేదో సినిమాలో ఘటన కాదు చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకొన్న రాజకీయ ఘటన. భీమవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడు.. వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం చిన్నరామాపురంలో జరిగిన కుటుంబ గొడవల్లో మధ్యవర్తిగా మునిరత్నం నాయుడు బాధితులతో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ వెళ్లారు.
12 ఏళ్ల వయసులో యాసిడ్ దాడి- 37 ఆపరేషన్లు, ఆరేళ్లు ఆస్పత్రిలో నరకం- ఇప్పుడీ ప్రొఫెసర్ 'స్వరకోకిల'
ఇరువర్గాలకు సఖ్యత కుదరకపోవడంతో ద్విచక్రవాహనంపై స్వగ్రామం భీమవరం వెళ్తుండగా.. చంద్రగిరి గ్రామ పొలిమేర్లలో వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన మునిరత్నంను స్థానికులు హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తీసుకెళ్లారు.
"మొత్తం పది మంది వచ్చి మా నేతను అంటావా అనుకుంటూ కొట్టినారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. మా నేతను ఏం చేయలేవు అన్నారు." -మునిరత్నం, బాధిత టీడీపీ నేత
రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, వైసీపీ కార్యకర్త మట్టిరెడ్డి, అతని అనుచరులు బండరాళ్లతో తనపై దాడి చేశారని.. బాధితుడు మునిరత్నం వాపోయారు. దాడికి పాల్పడిన వారు ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులేనని చెప్పారు. ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆస్పత్రికి వెళ్లి మునిరత్నాన్ని పరామర్శించడం చర్చనీయాంశమైంది.
ఓటమి భయంతోనే మునిరత్నంపై వైసీపీ నాయకులు దాడి చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మునిరత్నం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మద్యం, గంజాయి మత్తులో చెవిరెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్మీ జవాన్‌పై పోలీసుల అరాచకం - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా మూకుమ్మడి దాడి