Srikalahasteeswara temple land: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.80 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారు. అవి ప్రైవేటు భూములుగా పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాళహస్తిలోని సర్వే నంబరు 292లోని 4.03 ఎకరాల భూమిని రామనాథన్ చెట్టియార్, అరుణాచలం చెట్టియార్ అనే దాతలు 1931లో ఆలయానికి గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఇక్కడ నందన వనం ఏర్పాటు చేయాలనేది దాతల ఉద్దేశం. పట్టణం విస్తరించడం, భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఈ భూమి వాణిజ్య అవసరాలకు కీలకంగా మారింది. ఇప్పటికే చుట్టుపక్కల పెద్ద ఎత్తున హోటళ్లు వెలిశాయి. దీంతో ఈ భూమి తమదంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులు తెరమీదకు వచ్చారు. అధికార పార్టీ నేతలు అండగా వారు పావులు కదుపుతున్నారు.
కోర్టు కొట్టేసినా.. మళ్లీ..: 1990లో రామనాథన్ చెట్టియార్ నుంచి ఒక సంస్థ పేరుతో ఎకరం భూమి కొనుగోలు చేశామని, ఆ తర్వాత 2012లో 0.58 ఎకరాలు కొన్నట్లు 2017లో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. దేవాదాయశాఖ అధికారులు వాదిస్తున్న భూమి శ్రీకాళహస్తికి 15 కి.మీ.ల దూరంలో కొంత, తమిళనాడులో కొంత ఉన్నట్లు చెబుతూ వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయ భూములను 2016లోనే నిషేధిత జాబితాలో పొందుపర్చారని, వీటిని కావాలనే 2017లో ఆ జాబితాలో చేర్చారని హైకోర్టుకు విన్నవించారు. ఈ వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకుండా వీరి పిటిషన్‌ను కొట్టేసింది. అయినప్పటికీ సదరు వ్యక్తులు తాజాగా మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సారి వీరికి అనుకూలంగా పత్రాలు సృష్టించాలని వైసీపీ నేతలు ఆలయ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ పత్రాలనే న్యాయస్థానంలో సమర్పించాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే ఆలయ భూములని కౌంటర్ దాఖలు చేశామని, మళ్లీ అందుకు విరుద్ధంగా పత్రాలు ఇస్తే విమర్శలు వస్తాయని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: