YSRCP leader tried to occupy the House: తిరుపతి నగరంలోని సింగాలగుంట ప్రాంతంలో గడచిన ముప్పై సంవత్సరాలుగా ప్రకాశరావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. తిరుపతి అర్బన్ మండలం పరిధిలోని సింగాలగుంట సర్వే నంబరు 109లో తన తల్లి వైద్యం సీతమ్మ పేరుతో 1992లో రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు. ఆ స్థలంలో ఇళ్లు కట్టుకున్న సీతమ్మ.. తన కుమారుడు ప్రకాశరావుతో కలిసి నివాసం ఉంటున్నారు.
కొంత కాలం క్రితం అనారోగ్యం పాలైన సీతమ్మ చికిత్స నిమిత్తం చెన్నై, మదనపల్లెతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. నెలలపాటు ఇళ్లు వదిలి వెళ్లడం.. నిర్వహణ లేకపోవడంతో పూరిల్లు శిథిలావస్థకు చేరింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్లిని బతికించుకోలేకపోవడంతో ప్రకాశరావు మానసికంగా కుంగిపోయారు. తల్లి మరణానంతరం ఇళ్లు వదిలి స్నేహితులు, తెలిసిన వారి వద్ద గడిపారు.
ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో అధికార వైకాపా మహిళా నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్‌పర్సన్ మధుబాల కబ్జాకు యత్నించారు. కొంతకాలం తర్వాత తిరిగొచ్చిన ప్రకాశరావు.. ఇల్లు, స్ధలం ఆక్రమణకు గురవుతుండటాన్ని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన వైకాపా నేత తాను ఇచ్చిన డబ్బు తీసుకుని సంతకం చేయాలని, లేకపోతే బొటనవేలు కత్తిరించి సంతకం తీసుకుంటామని బెదిరించినట్లు బాధితుడు ప్రకాశరావు వాపోయారు.
ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇల్లు ఆక్రమణకు గురవుతుండటంతో ప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో స్థానికులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇంటిని ఆక్రమించేందుకు వచ్చిన వ్యక్తులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన వైకాపా నాయకురాలు మధుబాల తన అధికార బలాన్ని ఉపయోగించి తమ అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మహిళలు వాపోయారు.
రాత్రివేళ్లలో మధుబాల అనుచరులు వచ్చి వేధించడంతో 100కు ఫోన్ చేస్తే.. పోలీసులు వచ్చి అండగా నిలవకపోగా, తమనే స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ఆక్రమణకు గురవుతుండటంపై రెండు నెలల క్రితం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని.. అధికార పార్టీ నేతలు రాజీ కుదుర్చుకోమంటూ సలహా ఇస్తున్నారని బాధితుడు ప్రకాశరావు, స్థానిక మహిళలు ఆరోపించారు.
ఇవీ చదవండి