Union Minister of Telecom and IT Dev Sinha Chauhan: తిరుపతి జిల్లాలో నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పరిపాలనపై మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ పాల్గొన్నారు. నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పాలనలో జరిగిన అభవృద్ధిపై ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపాడు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని దేవ్ సిన్హా వెల్లడించాడు. వైసీపీ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. జగన్ తన అనుచరులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని కేంద్ర మంత్రి విమర్శించాడు. కేంద్ర పథకాలను పేర్లు మార్చి జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ.. రాష్త్ర ప్రభుత్వం ఆ పథకాలకు రాష్ట్రం తమ పథకాలుగా చెప్పుకుంటుందని విమర్శించారు.
జగన్ తన అనుచరులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు: వెంకటగిరిలో చేనేత వర్గాలతో దేవ్ సిన్హా చౌహాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జౌళి శాఖ నుంచి చేనేతను వేరు చేసి ప్రత్యేక శాఖగా ప్రకటించాలని కోరారు. ప్రస్తుత అవసరానికి తగిన రాయితీలు, సదుపాయాలను కల్పించాలని మంత్రిని అభ్యర్థించారు. వెంకటగిరిలో నర్సాపూర్, వెండొడు రైల్వే స్టేషన్లో అదిలాబాద్- తిరుపతి మధ్య తిరిగే కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని స్థానికులు విన్నవించారు. జగన్ ప్రభుత్వం.. అవినీతి ప్రభుత్వమని కేంద్ర మంత్రి అన్నారు. చేనేత కార్మికుల సమస్యలు విన్న తురువాత తనకు బాధ కలిగిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 90 శాతం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 శాతం నిధులు విడుదల చేయలేకపోతుందని దేవ్ సిన్హా విర్శించారు. విద్యుత్ సబ్సిడీ, ఇన్సూరెన్స్... తదితర అంశాలపై వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం: ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నియోజకవర్గంలోని నాయకులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు పోరాడాలని పిలుపునిచ్చారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని దేవ్ సిన్షా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్టానికి చెందిన పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.