Two Women Died in Malakpet Govt Hospital : తెలంగాణలోని హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చి ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు బాలింతల మృతితో నగరంలోని మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ బాధితుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్.. తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మహేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు.

మరోవైపు తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జగదీశ్.. తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది.
ఇద్దరు బాలింతల మృతితో బాధిత కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు బాలింతలు మృతి చెందినా కనీసం వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
పేదలైనందునే చిన్నచూపు చూస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు నిరసించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింతలు చనిపోయారని చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ఘటనపై డీఎంహెచ్‌ఓ, కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. బాధ్యులైన వైద్యులపై వేటు వేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై ఆస్పత్రి డీసీహెచ్ఎస్ సునీత స్పందించారు. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. "సిరివెన్నెలకు ప్రసవమైన రెండోరోజు గుండె సమస్య వచ్చింది. సమస్య చెప్పగానే గాంధీకి తరలించాం. శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉంది. హై రిస్క్ అని ముందే చెప్పాం. బాలింతలకు చికిత్సలో ఎలాంటి లోపం లేదు." అని చెప్పారు.