TTD Darshan Tickets Schedule: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తితిదే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్‌లో టికెట్లను పొందిన భక్తులు.. టికెట్ల డబ్బులు చెల్లించాలని తితిదే పేర్కొంది. దీని ద్వారా భక్తులు తమ టికెట్లను ఖరారు చేసుకోవచ్చని తెలిపింది.
ప్రతి నెలా 21వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేస్తారు. ప్రతి నెల 23వ తేదీన శ్రీవాణి ట్రస్టు, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు విడుదల అవుతాయి. ప్రతి నెల 24వ తేదీన 300 రూపాయల దర్శన టికెట్ల కోటా విడుదల కాగా తిరుపతిలో గదుల కోటాను 25వ తేదీన విడుదల చేయనున్నారు.
తిరుమలలో గదుల కోటాను 26వ తేదీన విడుదల చేస్తారు.సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తామని తితిదే తెలిపింది. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
కాలినడకన వచ్చేవారికి అసౌకర్యం కలగకుండా చూడాలి: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు గతంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తితిదే చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు కోటా విధించి.. టోకెన్లు పూర్తి అయ్యాక మీ దారి మీరు చూసుకోండి అనే విధంగా తితిదే వ్యవహరిస్తోందని కొందరు భక్తులు తన దృష్టికి తెచ్చినట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకాలపాటి రఘువర్మ తెలిపారు.
ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీలు ప్రభాకర రావు, శంబిపూర్ రాజు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్సీ రఘువర్మ మీడియాతో మాట్లాడుతూ కాలినడకన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయాలని ఆయన సూచించారు.
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభమయ్యాక రెండు, మూడు రోజులుగా భక్తులు పెద్దఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గురువారం శ్రీవారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డులోని శిలాతోరణం దాకా దాదాపు రెండు కిలోమీటర్లు లైన్లలో బారులు తీరారు. వీరికి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తితిదే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం సుమారు గంటకు పైగా వర్షం కురవడంతో రహదారులు, శ్రీవారి ఆలయ మాడవీధుల్లో వర్షపు నీరు ప్రవహించింది.
ఇవీ చదవండి: