TTD FACE NEWS: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని 6 నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తితిదే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవ వివరాలను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. ‘ఆనంద నిలయం బంగారుతాపడం పనులు ఆరు నెలల్లోగా పూర్తిచేయాలని తితిదే నిర్ణయించింది.
బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023 మార్చి 1వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి వైదిక క్రతువులు నిర్వహిస్తారు. గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీవేంకటేశ్వరస్వామి వారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. అనంతరం బంగారు తాపడం పనులు చేపడతారు. ఈ ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని, బాలాలయంలోని దారు విగ్రహాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. మూలమూర్తికి, దారు విగ్రహానికి అన్ని ఆర్జిత సేవలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
ఇవీ చదవండి: