TTD EO Dharma Reddy appeal against Jail sentence: కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. ఈవో అఫిడవిట్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్తులో ప్రోగ్రాం అసిస్టెంట్లుగా ముగ్గురి సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు చేయకపోవడంతో కోర్టుధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెల రోజుల సాధారణ జైలుశిక్ష, జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఈనెల 13న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై అదే రోజు టీటీడీ లైజనింగ్ అధికారి అఫిడవిట్ ఇస్తూ అత్యవసరంగా అప్పీల్ వేశారు. విచారణ 14కు వాయిదా పడింది. అప్పీల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈవో తరఫున సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ దాఖలు చేశామన్నారు. తేదీల వివరాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఇవీ చదవండి: