TTD Board of Trustees Meeting Decisions: శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులను చేపట్టాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి మూలవిరాట్టుకు నిత్య సేవల నిర్వహణ, భక్తుల దర్శనం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ రోజు అన్నమయ్య భవనంలో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో నిర్వహించిన విధంగానే బంగారు తాపడం పనులు చేస్తామని అన్నారు. ఇందుకోసం భక్తులు హుండీలో సమర్పించిన బంగారాన్నే బంగారు తాపడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని జనవరి 2వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరవనున్నట్లు ఆయన తెలిపారు. గత నిర్వహించునట్టుగానే పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వారాల గుండా దర్శనం అందుబాటులో ఉంటుందని అన్నారు. పది రోజులకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తామన్నారు.
బ్రేక్ దర్శనం సమయం మార్పు: జనవరి 2వ తేదీన రాజ్యాంగ హోదాలో ఉన్న వీఐపీలు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల సర్వదర్శనం టోకన్లు కేటాయించనున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీన సర్వదర్శనం టోకన్ల కౌంటర్ ప్రారంభమవుతుందని.. టోకన్లు పూర్తయ్యేదాకా తిరుపతిలో కౌంటర్లు తెరిచే ఉంటాయని వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనానికి రోజుకు 25 వేల చొప్పున రూ 300 టికెట్లు.. మొత్తం 2.5 లక్షల దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో కేటాయిస్తామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం 331 ఆలయాలు నిర్మాణ దశలో ఉన్నాయని.. మరో 1100 పైగా ఆలయాలను త్వరితగతిన నిర్మాణాలు చేయాలని నిర్ణయించామన్నారు. తితిదే ఆసుపత్రుల్లో ఔషదాలు, సర్జికల్ పరికరాల కొనుగోలు కోసం 2.86 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకొని బ్రేక్ దర్శన సమయం మార్చినట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటలకు వీఐపీ దర్శన సమయం కేటాయించినట్లు ప్రకటించారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండోవ కనుమ దారిలో రక్షణ గోడల నిర్మాణానికి రూ. 9 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఇవీ చదవండి: