Sanitation Workers Strike : తమ సమస్యలను పరిష్కరించాలని కొరుతూ తితిదేలో పనిచేస్తున్న సులభ్ కార్మికులు ఆందోళనకు దిగారు. తిరుపతి, తిరుమలలో పారిశుద్ద్యపనులను నిర్వహించే సులభ కార్మికులు తమ విధులను బహిష్కరించారు. తిరుపతిలోని హరేరామ, హరేకృష్ణ మైదానంలో నిరసన చేపట్టారు. తితిదే నిర్వహణలో ఉన్న కార్పొరేషన్‌లోకి తమను విలీనం చేయాలని సులభ కార్మికులు కోరారు. వివిధ కారణాలు చూపుతూ గతంలో వస్తున్న జీతంలో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు.
మమ్మల్ని తితిదే కార్పొరేషన్‌లో కలపండి.. తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్‌లో తమను కలపాలంటూ తిరుపతిలో సమ్మె చేయటంతో పారిశుద్ధ్యం చేసే వారు లేకుండా కొంతమేర ఇబ్బందులు తలెత్తాయి. వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రం, తిరుమలలోని భక్తులు బస చేసే వసతి సముదాయాల వద్ద పారిశుద్ధ్యం లేక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తితిదే కింద పనిచేస్తున్న తిరుపతిలో 300 మంది కార్మికులను తిరుమలకు చేరుకునేలా తితిదే ఆరోగ్య శాఖ విభాగం చర్యలు తీసుకుంది..కార్మికుల సమ్మెపై తితిదే స్పందించింది.
ఆందోళనకు దిగేముందు యాజమాన్యానికి తెలియజేయాలి.. పారిశుధ్య కార్మికుల సేవలు అత్యవసర సర్వీసుల కిందకు వస్తాయనీ, కాబట్టి మీరు ఆందోళనకు దిగడానికి ముందుగానే యాజమాన్యానికి తెలియజేయాలనీ చెప్పింది. అలా కాకుండా భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదనీ, 24 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరకపోతే యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుందనీ.. తితిదే సంస్థపై సమ్మెకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటనను విడుదల చేసింది..
మా సమస్యలని పట్టించుకోని సీఎం.. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో తమ సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగాలను పర్మినేంట్ చేస్తామని ప్రకటించిన జగన్ తమ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆకస్మికంగా సులభ కార్మికులు విధులను బహిష్కరించడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా తితిదే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
ఇరవై ఏళ్లుగా జీతం పెంచుతారనే ఆశతో బతుకుతున్నాం. కొండంతా కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. దేవునికి సేవ చేస్తున్నాం.. దేవుడు కరుణించినా మధ్యలో ఉన్న వారు మమ్మల్ని చేరదీయటం లేదు. మమ్మల్ని కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. -సులభ్ కార్మికులు
మాకు ఈ ఉద్యోగంలో ఎలాంటి ప్రయోజనాలు లేవు కనుక మాకు టైమ్‌స్కేల్ ఇవ్వాలి.. అదే విధంగా మాకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాలి. అంతే కాకుండా మాకు పీఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలి. ప్రస్తుతం మేము తొమ్మిది వేలకు చేస్తున్నాం.. దాన్ని కూడా ఎనిమిది వేలకు చేస్తామంటున్నారు. ఎక్కడైనా పని చేస్తే జీతం పెరుగుతుంది కానీ తగ్గుతుందా..? పదకొండు వేలు ఉన్న జీతం ఇప్పుడు తొమ్మిది వేలు చేశారు ఇదేమైనా న్యాయమేనా అని అడుగుతున్నాం. -సులభ్ కార్మికులు
ఇవీ చదవండి :