Tensions in Chindepalli Village : రహదారి కోసం చిందేపల్లి గ్రామస్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలోని గ్రామస్థులు ఈ రోజు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేదని అన్నారు. అయినప్పటికీ పోలీసులు శనివారం ఉదయం గ్రామానికి చేరుకుని స్థానికులను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. గృహ నిర్బంధం చేసిన విషయం తెలుసుకున్న జనసేన నేతలు పోలీసుల తీరును తప్పుబట్టారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు గ్రామానికి చేరుకుని.. గ్రామస్థులతో కలిసి పాదయాత్రగా ఎలెక్ట్రో స్టీల్ పరిశ్రమ వద్ద.. చిందేపల్లి రహదారికి అడ్డంగా నిర్మించిన గోడ వద్దకు చేరుకున్నారు. దానిని గ్రామస్థులతో కలిసి కూల్చే ప్రయత్నం చేశారు. గోడను కూల్చకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డగింపుతో.. ఏర్పేడు- రేణిగుంట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టేందుకు బయలుదేరగా.. సమాచారం తెలుసుకున్న పోలీసులు మరింత సిబ్బందిని ఘటనాస్థలానికి రప్పించారు. ధర్నా కోసం సిద్ధమైన జనసేన నేతలను, గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకోవటంతో ఉద్రిక్తత : గ్రామస్థులను, జనసేన నేతలను అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గ్రామస్థులపై లాఠీఛార్జీ చేశారు. రహదారి కోసం వారం రోజులుగా ఆందోళన చేపడుతున్నా పట్టించుకోని అధికారులు.. పరిశ్రమ యాజమాన్యం కోసం పని చేస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపని పోలీసులు.. పరిశ్రమకు కాపలా కాస్తున్నారని దుయ్యబట్టారు.
గ్రామానికి రహదారి సమస్య : తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలానికి చెందిన చిందేపల్లి గ్రామానికి రహదారిని.. ఎలెక్ట్రో స్టీల్ పరిశ్రమ యాజమాన్యం వారం రోజుల క్రితం మూసివేసిందని గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. గ్రామస్థులు తమ నిరసనలను ఏదోక రూపంలో తెలుపుతునే ఉన్నారు. రహదారి మూతతో గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్థులు వాపోయారు. గతంలో మాదిరిగానే రోడ్డు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఈ సమస్యపై జిల్లాధికారులను సైతం గ్రామస్థులు సంప్రదించారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టరేట్‌కు గ్రామస్థులు మళ్లీ బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోనే వారిని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డగింతను గ్రామస్థులు వ్యతిరేకించారు. కలెక్టరేట్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్థులు హెచ్చరించారు.
ఇవీ చదవండి :