Nara lokesh Yuvagalam Padayatra : అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యువత, విద్యార్థులు, వృత్తిదారులు, మహిళలతో పాటు ముఖ్యంగా వ్యవసాయదారులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా పరిశీలించి భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలో పర్యటించిన లోకేశ్.. వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటామని లోకేశ్ భరోసా కల్పించారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గంజాయికి తప్ప మరే ఇతర పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 24వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పేడు మండలం మడిబాకంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి రైతులను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఇప్పటివరకు వ్యవసాయరంగాన్ని ఉపాధిహామీతో అనుసంధానం, ప్రత్యేకహోదా, విభజన హామీలపై పార్లమెంట్లో నోరు విప్పలేదని తెలిపారు.
ఉపాధి హామీని అనుసంధనం చేస్తాం.. రైతుల కోరిక మేరకు తాము అధికారంలోకి వచ్చాక కేంద్రాన్ని ఒప్పించి వ్యవసాయాన్ని నరేగాకు అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 1న అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పెంచుతామని... 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
సుఖీభవ మళ్లీ ప్రారంభిస్తాం... టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు వచ్చాయని ఆరోపించారు. పాదయాత్రలో ఒక్క రైతుభరోసా కేంద్రం పని చేస్తున్నట్టు తన కంటికి కనిపించలేదని.. ఆర్బీకే కేంద్రాలు అనేవి పనికిమాలిన పథకమన్నారు. భూసార పరీక్షా కేంద్రాలను పెడతానని జగన్ రెడ్డి మాట తప్పారని.. రాష్ట్రంలో ఎక్కడా భూసార పరీక్షలు లేవన్నారు. జగన్ రెడ్డి అన్నం తిని బతుకుతున్నాడో, కరెన్సీ తిని బతుకుతున్నాడో తనకు అర్థం కావడం లేదన్నారు.
లోకేశ్ పాదయాత్ర మార్గంలో ఏర్పేడు మండలం మర్రిమంద వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాల వద్ద వైకాపా కార్యకర్తలు గుమికూడటంతో వాతావరణం వేడెక్కింది. లోకేశ్ యాత్ర సాగే మార్గంలోని ఫ్లెక్సీలను దుండగులు చించివేశారు. వైకాపా కార్యకర్తల తీరుపై తెదేపా నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాదయాత్రపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వైకాపా కార్యకర్తలకు పోలీసులు రక్షణ కల్పిస్తూ తమపై కేసులు పెడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పాపానాయుడు పేటలో ప్రజలనుద్దేశించి లోకేశ్ మాట్లాడారు. గన్నవరంలోని పార్టీ ఆఫీస్‌పై దాడి చేసిన వాళ్లపై కేసు లేదు.. ప్రజలతో మాట్లడితే తనపై కేసు పెట్టడమేంటన్నారు. తెదేపా నాయకుల ఓర్పు, సహనాన్ని పరీక్షించవద్దని పోలీసులకు సూచించారు. ఎవరైతే దాడి చేశారో వారిని వదిలేది లేదన్నారు. రేపు అధికారంలోకి వచ్చేది తెదేపానేనని అన్నారు. ఇక్కడ బడా చోర్ ఒకరు ఉన్నారని... ఇసుక రీచ్‌లో ఇసుక దోపిడీ లాంటి వాటికి కేసు లేదని.. చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక అన్ని దోపిడీలు బయటకు తెస్తామన్నారు.
ఇవీ చదవండి :