Lokesh fire on cm jagan : చంద్రబాబు పరిపాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం... నేడు జగన్ పాలనలో ఫినిష్ ఆంధ్రప్రదేశ్ గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మదనపల్లిలోని టీకేెఎన్ వెంచర్ అన్నమయ్య నగర్ లో జరిగిన బహిరంగసభలో లోకేశ్ పాల్గొన్నారు. మదనపల్లి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీలో చేరారు. బహిరంగ సభలో లోకేశ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మదనపల్లిని టీడీపీ కంచుకోటగా చేసేందుకు షాజహాన్ కృషిచేయాలని కోరారు. పోరాటాలకు పుట్టినిల్లు మదనపల్లె అని... స్వాతంత్ర ఉద్యమ పోరాటం కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక విరాళాలు ఇచ్చింది మదనపల్లి నుంచేనని ఆయన తెలిపారు. జాతీయగీతం బెంగాళీ భాష నుంచి తెలుగులో అనువాదం జరిగిన పవిత్ర భూమి మదనపల్లె అన్నారు.
అప్పుల్లో నంబర్ 1... జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో, అధికధరల్లో, పన్నుల్లో నెంబర్ 1 గా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ అమలు చేసే ప్రతి పథకం వెనకాల ఓ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. కళాశాల విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఎత్తివేసి, తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంపూర్ణ మద్యపాన నిషేధమన్న జగన్, స్వయంగా మద్యం తయారు చేస్తున్నాడని ఆరోపించారు. మహిళల తాళిబొట్లును సైతం తాకట్టు పెట్టేలా, కుటుంబాలను అప్పుల మయంగా చేశారని, దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లపట్టాల పథకం కింద వైఎస్సార్సీపీ నాయకులు 25వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. జగన్ మైనారిటీలను నమ్మించి మోసం చేశాడని... మైనారిటీలను అన్నివిధాలా ఆదుకుంది, రాజకీయంగా ప్రోత్సాహించింది టీడీపీ మాత్రమే అని గుర్తు చేశారు.
మొత్తం దందా.. దనపల్లికి ఒక్కరు కాదు.. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు పాపాల పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి మదనపల్లిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని... 40 ఎకరాలు కబ్జా చేసి వెంచర్ లు వేసి అమ్మేశారని ధ్వజమెత్తారు. కొండలు, చెరువులు, భూమిలు దేన్ని వదలకుండా స్వాహా చేస్తున్నారని... వందల టిప్పర్లు ఇసుక, గ్రావెల్ ను ప్రక్కరాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రేపు తంబళ్లపల్లెకు వస్తున్నానని... అభివృద్ది పై చర్చించేందుకు దమ్ముంటే పాపాల పెద్దిరెడ్డి రావాలని సవాల్ విసిరారు. మదనపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తామన్నారు. 2024 ఎన్నికల్లో టీపీడీని భారీ మెజారిటీతో గెలిపిస్తే... మదనపల్లిని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :