Srikalahasti Municipal Employee Alluraiah Arrested: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు తలెత్తుతున్నాయి. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, కొన్ని శాఖల అధికారులు.. ఇంటి పట్టాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కొంతమంది లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన అధికారులు దర్యాప్తు చేపట్టగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు.
పేదల ఇంటి పట్టాల్లో అక్రమాలు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అల్లూరయ్య అనే అధికారిపై రెండో పట్టణ పోలీసులు.. చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని రాజీవ్ నగర్ కాలనీలో పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన ఇంటి పట్టాల విషయంలో అధికారి అల్లూరయ్య అక్రమాలకు పాల్పడ్డారని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు భాగంగా అల్లూరయ్య ఇంట్లో నకిలీ పట్టాలతోపాటు రబ్బర్ స్టాంపులు లభ్యమయ్యాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన అధికారులు.. అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
మున్సిపల్ అధికారి అరెస్ట్.. సీఐ మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం..''రాష్ట్ర ప్రభుత్వం మూడు దశాలుగా నిరుపేదలకి ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. ఇళ్ల పట్టాలు మంజూరైన రోజు నుంచి అనేక అక్రమాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారుల దృష్టికి రాగా.. మాకు కూడా సమాచారం అందించారు. దీంతో మేము దర్యాప్తు చేపట్టగా.. ఈ నెల 1వ తేదీన శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీలో ఇళ్ల పట్టాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అక్కడి వార్డు ఉద్యోగి ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఎమ్మారో ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పురపాలక సంఘం కార్యాలయం ఉద్యోగి అల్లూరయ్య ఇంట్లో సోదాలు చేయమని మాకు ఆర్డీఓ నుంచి ఆదేశాలు అందాయి. మేము సోదాలు చేపట్టగా.. సుమారు 1600 ఒరిజినల్ పట్టాలను గుర్తించాము. ఆ పట్టాలను ఇంట్లో ఉంచుకొని అక్రమాలకు చేస్తున్నట్లు తేలింది. ఇతనితోపాటు ఇంకా చాలా మంది అక్రమాలకు పాల్పడుతున్నారు. అల్లూరయ్యపై చీటింగ్ కేసు బుక్ చేసి విచారిస్తున్నాం'' అని ఆయన అన్నారు.
అసలు ఏం జరిగిందంటే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని.. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన ఇంటి పట్టాల విషయంలో పురపాలక సంఘం కార్యాలయం ఉద్యోగి అల్లూరయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు. గతంలో రాజీవ్ నగర్ కాలనీలో ఏడు వేల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయగా.. ఆ సమయంలో గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న అల్లూరయ్య చేతివాటం ప్రదర్శించారు. సుమారు 1600లకు పైగా ఇంటి పట్టాలను గృహ నిర్మాణ శాఖ కార్యాలయం నుంచి అపహరించుకుని.. తన ఇంట్లో పెట్టుకోవడంతోపాటు పేదలకు అధిక ధరలకు విక్రయించారు.
ఈ విషయంపై పలువురు లబ్ధిదారులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో గత పది రోజుల కిందట అధికారులు అల్లూరయ్య ఇంట్లో దాడులు నిర్వహించి, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రెండో పట్టణం పోలీసులు అల్లూరయ్యపై చీటింగ్ కేసు నమోదు చేసి.. రిమాండ్‌కి తరలించినట్టు సీఐ మల్లికార్జున వివరించారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలోనే మిగతా నిందితులను అదుపులోకి తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.
ఇవీ చదవండి