Former Minister Yanamala Ramakrishnudu: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజ్యాంగం పరంగా లభించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. తిరుపతి జిల్లాలోని తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, సేవ చేసేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయని యనమల తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అవినీతి మయం, అక్రమార్జన అని యనమల ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన జరగడం దురదృష్టకరమన్నారు. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల అవగాహన లేదని మండిపడ్డారు.
పాదయాత్రను అడ్డుకోవడంపై: వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుతో పాటు పలువురు పాదయాత్రలు చేసినా ఎవరూ అడ్డుకోలేదని యనమల గుర్తు చేశారు. గతంలో పాదయాత్రలను అడ్డుకున్న చరిత్ర లేదని విమర్శించారు. పాదయాత్రలను అడ్డుకోవడం జగన్ పాలనలోనే చూస్తున్నామని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తుంటే పోలీసులు మైకులు లాక్కుంటారు, స్టూల్ తీసేస్తారని విమర్శించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలు వైఎస్సార్సీపీకి పట్టవా? అంటూ యనమల ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షాలుగా తాము ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నాం చేస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాము చేసే విమర్శలకు సమాధానం చెప్పాలిగానీ.. ఎదురుదాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ అక్రమాలపై: ఇసుక, మద్యం, మైన్స్‌ను దోపిడీ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన మనుషులేనని యనమల ఆరోపించారు. లిక్కర్ వ్యాపారంలో సైతం అవినీతి జరుగుతోందని యనమల విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలలో రాష్ట్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చిందో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 11 లక్షల కోట్లు అయ్యాయని.. ఆ అప్పులు ఏమయ్యాయన్నారు. రాష్ట్రంలో అర్థిక అభివృద్ధి జరగడంలేదన్నారు. వివేకానంద రెడ్డి హత్యకు చంద్రబాబుకు సంబంధం ఏమిటని... ఆయన హత్యను ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని యనమల ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్యను జగన్మోహన్ రెడ్డి చేయించారని త్వరలో నిరూపణ కానుందని యనమల రామకృష్ణుడు మీడియా సమావేశంలో వెల్లడించారు.
'వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుతో పాటు పలువురు పాదయాత్రలు చేసినా ఎవరూ అడ్డుకోలేదు. రాజ్యాంగం పరంగా లభించిన ప్రాథమిక హక్కులను కాలరాస్తూ.. వైఎస్సార్సీపీ ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తుంటే పోలీసులు మైకులు లాక్కుంటారు, స్టూల్ తీసేస్తారు. గత నాలుగు సంవత్సరాలలో రాష్ట్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చిందో చెప్పగలరా.. రాష్ట్రంలో చేసిన అప్పులు 11 లక్షల కోట్లు అయ్యాయి.'- యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి.
ఇవీ చదవండి: