Sugar Farmers Protest: మూతపడిన సహకార చక్కర పరిశ్రమలను మనుగడలోకి తేవడం ద్వారా.. చెరకు రైతులను ఆదుకుంటామని పాదయాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీని గాలికొదిలేశారు. మూతపడిన సహకార చక్కర పరిశ్రమలను విక్రయించడానికి లిక్విడేటర్‌ను నియమించారు.
తిరుపతి సమీపంలోని గాజులమండ్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా మారుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. చక్కెర పరిశ్రమ నిర్వహణకు సరిపడా చెరకు పంట లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిశ్రమ విక్రయానికి వీలుగా లిక్విడేటర్‌నూ నియమించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆందోళనలు చేపట్టారు. లిక్విడేటర్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రైతుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ చర్యలపై స్టే విధించింది.
శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ప్రకటించిన జగన్ .. వెయ్యి కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ ఆస్థులపై కన్నేసి విక్రయించడానికి చర్యలు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సహకార చక్కర పరిశ్రమలో భాగస్వాములైన తమ అనుమతి లేకుండా విక్రయ ప్రయత్నాలు ప్రారంభించారని రైతులు మండిపడ్డారు. పరిశ్రమను విక్రయించాలన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు.
ప్రైవేట్ రంగంలో ఏర్పాటైన చక్కెర పరిశ్రమలు లాభాలు గడిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. సహకార రంగ పరిశ్రమలు మూసేసి.. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్థులు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు.
" మూతపడిన ఈ చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని పలు దఫాలుగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు అది పునరుద్ధరించకపోగా.. చక్కర పరిశ్రమలను విక్రయించడానికి లిక్విడేటర్‌ను నియమించారు. దీంతో మాకు వేరే గత్యంతరంలేక కోర్టును ఆశ్రయించాము. మా వాదనలు విన్న న్యాయస్థానం మాకు సానుకూలంగా స్పందించి.. ప్రభుత్వ చర్యలపై స్టే విధించింది." - నాగిరెడ్డి, రైతు
" ఎన్నికల ముందు సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా.. మూతపడిన సహకార చక్కర పరిశ్రమలను మనుగడలోకి తెస్తామని అన్నారు. దీని ద్వారా.. చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీని గాలికొదిలేశారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలను అమ్మేయటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ ఉండే కంప చెట్లను వేలం వేశారు. ఆ తర్వాత పెద్ద చెట్లను కూడా వేలం వేసేందుకు టెండర్లను పిలిచారు. మా రైతులమంతా వచ్చి అడ్డుకోవటంతో ఈ టెండర్ ఆగింది. వైసీపీ సర్కారు మాకు ఇచ్చిన హామీలను మర్చిపోయి.. ఇలా వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు." - చిన్నారెడ్డి, రైతు