Srikalahasti Temple: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సత్యనారాయణ మొదటిసారి మంత్రి హోదాలో ఆలయానికి వస్తుండటంతో అరగంట ముందునుంటే భక్తులను క్యూలైన్లలో నిలిపేశారు అధికారులు. దీంతో ఆగ్రహించిన భక్తులు.. మంత్రి ఆలయంలోకి రాగానే "డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి సౌకర్యాలూ కల్పించకుండా క్యూలైన్లలో నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. కరోనా తగ్గుముఖం పట్టడం, సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.
దర్శనానంతరం మంత్రి సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు. ఆలయాలకు వచ్చే భక్తులకు సంతృప్తికర దర్శన ఏర్పాట్లు కల్పించాలన్నది తన ముందున్న ప్రధాన లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరున్ని శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి మంత్రి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై ఇప్పటికే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. అన్ని ఆలయాలను సందర్శించి అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఆలయాల విస్తరణ జరగాల్సి ఉందని, ఈ విషయమై తమిళనాడులోని మధురై ఆలయంలో చేపట్టిన ప్రణాళికలను ఇప్పటికే సాంకేతిక ఉన్నతాధికారులు పరిశీలించారని తెలిపారు. అమ్మఒడి పథకానికి.. 300 యూనిట్ల విద్యుత్తు వాడకానికి ముడిపెట్టడంపై ఓ విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ నిరుపేద కుటుంబాలకు ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 300 యూనిట్ల విద్యుత్తు వాడేవాళ్లు ఏ విధంగా పేదవాళ్లు అవుతారని ప్రశ్నించారు.
తొక్కిసలాటపై రాజకీయం చేయడం తగదు
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులకు సర్వదర్శనం క్యూలైన్లలో తితిదే చక్కని సౌకర్యాలు కల్పిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల కోసం చోటుచేసుకున్న భక్తుల తొక్కిసలాటపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని అన్నారు. అవసరమైతే ప్రతిపక్షాలు తితిదేకు మంచి సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 90వేల మంది వరకు భక్తులకు శ్రీవారి దర్శనం లభిస్తోందని చెప్పారు. క్యూలైన్లలో మరుగుదొడ్ల వద్ద కొంత ఇబ్బంది ఉందని భక్తులు తెలిపారని వాటిని సరిదిద్దాలని తితిదే అధికారులకు సూచించామని వెల్లడించారు.
ఇదీ చదవండి: తిరుమలలో భక్తుల తోపులాటకు కారణం అదే : వైవీ సుబ్బారెడ్డి