DEVOTEES CONFUSED WITH TTD DECISIONS : వైకుంఠ ఏకాదశి పర్వదినం మొదలు.. పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తి.తి.దే చేస్తున్న ప్రకటనలకు, అధికారుల నిర్ణయాలకు పొంతన లేకుండా పోతోంది. నూతన సంవత్సరం, ఏకాదశి పర్వదినాల పేరుతో శని, ఆదివారాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశారు.
ఎస్ఎస్ఎడీ టోకెన్లు ఉన్నవారితో పాటు లేనివారిని దర్శనానికి అనుమతించేవారు. శని, ఆదివారాల్లో రోజుకు 25 వేల చొప్పున తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో జారీ చేసే టోకెన్లను ముందస్తు ప్రకటన లేకుండా నిలిపివేశారు. టోకెన్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తార లేదా.. అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఫలితంగా భక్తుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
తిరుపతిలోని మూడు కేంద్రాల్లో గత కొంత కాలంగా సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తూ వచ్చారు. శని, ఆది వారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేసేవారు. ఏడాది చివరి రోజు శనివారం నాడు రాగా, జనవరి ఒకటవ తేదీ ఆదివారం, సోమవారం వైకుంఠ ఏకాదశి రావడంతో..శని, ఆదివారాల్లో సర్వదర్శనం చేసుకునే భక్తులకు టోకెన్ల జారీ నిలిపివేశారు.
సాధారణంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పుడు 3 రోజులపాటు ప్రత్యేక దినాలు ఉండటంతో మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. శనివారం వచ్చే భక్తులకు ఆదివారం ఉదయం వరకు దర్శనం కల్పించే అవకాశం ఉన్నా, ఆదివారం వచ్చే భక్తులకు ఎప్పటిలోగా దర్శనం పూర్తి చేస్తారనే విషయమై తి.తి.దే. అధికారులు స్పష్టత ఇవ్వని పరిస్థితి నెలకొంది.
ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటే అదే రోజు రాత్రి వరకు పూర్తి చేయగలరా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దర్శన ఏర్పాట్ల పట్ల తి.తి.దే. తీసుకున్న నిర్ణయాలపై స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: