Thiru Utsav 2023: ఆధునీకత, సాంకేతికత కలిపిన పరిశోధనలు, ఆటలు, పాటలు, చిత్ర, విచిత్రమైన సంబరాలకు ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ వేదికగా నిలిచింది. ఆ ప్రాంగణంలో 'తిరు ఉత్సవ్- 2023’ కార్యక్రమాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పలు విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులకు.. ఐఐటీ స్టూడెంట్స్ ఘన స్వాగతం పలికారు. అందరూ కలిసి వేడుక నిర్వహణలో భాగస్వాములు అయ్యారు. పలు ఈవెంట్లకు విద్యార్థులు ప్రణాళిక నిర్వహించారు.
అప్పుడు ఈగల్.. ఇప్పుడు నాలుగు కొమ్ముల జింక: తిరుఉత్సవ్ సూచికగా గత సంవత్సరం ఈగల్(గద్ద)ను సిద్ధం చేస్తే.. ఈసారి స్థానికతకు అవకాశం ఇస్తూ తిరుమల శేషాచల అడవుల్లో సంచరించే నాలుగు కొమ్ముల జింకను సూచికగా ప్రదర్శించారు. ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు దారాలతో సూచిక రూపొందించి ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేశారు. మూడు రోజుల తిరు ఉత్సవ్‌లో భాగంగా తొలి రోజు కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
సాంకేతిక, సాంస్కృతిక నైపుణ్యాల మేళవింపు: విద్యార్థుల్లోని సాంకేతిక, సాంస్కృతిక నైపుణ్యాలు ప్రదర్శించేందుకు ‘తిరు ఉత్సవ్’ దోహదపడుతుందని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ‘తిరు ఉత్సవ్-23’ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తల సహకారంతో ఈ సంవత్సరం 30 లక్షల రూపాయలతో కార్యక్రమం జరుగుతుందని, విజేతలకు బహుమతిగా రూ.2.50లక్షల నగదును అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఐఐటీ ఏర్పడినప్పటి నుంచి సహకారం అందిస్తున్న అమరరాజ పరిశ్రమ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం క్రిండల్ ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ షీలా, అమరరాజ బ్యాటరీస్ న్యూ ఎనర్జీ స్టోరేజ్ చీఫ్ టెక్నికల్ అధికారి జగదీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య వెంకయ్య పాల్గొన్నారు.
వన్ ఆన్‌లో యువత ఉత్సాహం: కేవలం సంప్రదాయ నృత్యమే కాకుండా, వెస్ట్రన్ డ్యాన్స్‌లతో పలువురు విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలతో అదరగొట్టారు. ‘వన్ ఆన్’.. అనే పేరుతో ఏర్పాటు చేసిన డాన్స్ పోటీల్లో పలువురు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. డాన్స్ చేసే వారిని ప్రోత్సహిస్తూ విద్యార్థుల సందడితో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
ఒక్కొక్కటీ.. అద్భుతమే..: తిరుఉత్సవ్‌కు వచ్చిన వారిని ఆకట్టుకునేలా ఈ దఫా విద్యార్థులు చేపట్టిన పలు ప్రదర్శనలు మరింత ఆకర్షణగా నిలిచాయి. వాంటెడ్ ఫొటో ఫ్రేమ్, సినిమా డెకరేషన్లు, సినిమా అడ్మిట్ వన్ ఇలా ప్రతి ఒక్కటీ ఆకట్టుకున్నాయి. పాతతరం సీడీలు, మ్యూజిక్ ప్లేయర్ల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆహా.. ఏమి రుచి..: తిరుఉత్సవ్ సంబరాల్లో భాగంగా ‘లీ చెఫ్’ పేరుతో వంట తయారీ పోటీలను ప్రారంభించారు. చదువులో ప్రతిభ చాటే విద్యార్థులు.. పాకశాస్త్ర ప్రావీణ్యులుగా మారి అద్భుతమైన వంటకాలు తయారు చేశారు. పాయసం చేయడం వచ్చు.. దోశ పోయడం తెలుసూ అంటూ.. రకరకాల వంటకాలు తయారు చేసి పోటీలు పడ్డారు. పోషకాలు అందించే పాలు, వెన్న, తాజా పండ్లతో పలువురు విద్యార్థులు సలాడ్లు తయారు చేసి ప్రదర్శించారు. వాటిని నిపుణులు పరిశీలించి మార్కులు వేశారు.
ఇవీ చదవండి: