TIRUPATI BANK ELECTIONS: తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల పోలింగ్ లో అధికార పార్టీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం ఆరోపించింది. సభ్యులు కానివాళ్లతో ఓట్లు వేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను బయటికి లాగేసి... ఇష్టారాజ్యంగా ఎన్నికలు జరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక మంది నాయకులను గృహనిర్బంధం చేశారని.. అక్రమాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారని దుయ్యబట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 3 గంటల నుంచి లెక్కిస్తారు.
LOKESH: రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో వైకాపా అక్రమాలు బయటపడ్డాయని.. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో తెదేపా నాయకులను గృహనిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారు తప్ప నాయకుడు అనరని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్న వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలని.. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ATCHANNAIDU: ఏ ఎన్నికలు జరిగినా వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక, అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. తెలుగుదేశం నేతలను గృహ నిర్భంధం చేసి, ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడం దారుణమన్నారు. వైకాపా నేతలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి అండగా ఉండటానికా, లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అని ప్రశ్నించారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో ఓట్లు వేయించడం అరచాకానికి పరాకాష్టగా అభివర్ణించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటున్న తెలుగుదేశం నేతలను అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం బలంతో టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచినా, సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్న హెచ్చరించారు.
ఇవీ చదవండి: