నాయకత్వ స్ఫూర్తి
గ్రామీణ ప్రాంతాల్లో మహిళ సర్పంచ్‌గా పాలన సాగిస్తే మున్ముందు మిగిలిన మహిళల్లోనూ పాలనపై ఆసక్తి పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరికొంత మంది ఇతర పెద్ద పదవులకు పోటీపడవచ్చని చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో మహిళలకే పట్టం కట్టారు. సర్పంచ్, వార్డుసభ్యుల రిజర్వేషన్లు గతేడాది ఖరారు చేసిన వాటినే ఇప్పుడూ పరిగణనలోకి తీసుకున్నారు. గతేడాది మార్చిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. కానీ ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు ముందే శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సర్పంచుల రిజర్వేషన్ జాబితాను సిద్ధం చేసింది.
గ్రామంలోని జనాభాకు, కేటగిరీలకు అనుగుణంగా 1,190 పంచాయతీలు, 11,148 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. మొదటి విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభంకాగా మరో మూడు దశల్లో మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో జిల్లా వ్యాప్తంగా 26 చోట్ల ఎన్నికలు జరగట్లేదు. ప్రస్తుతం 1,164 పంచాయతీల్లోని 10,924 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
* మొత్తం 1,190 పంచాయతీల్లో 604 పదవులను మహిళా సర్పంచుల పాలన త్వరలో చూడనున్నాం. అయితే ఎస్టీ జనరల్(49), ఎస్సీ జనరల్(50), బీసీ జనరల్(190), జనరల్(297)...ఇవన్నీ జనరల్ కేటగిరీ స్థానాలు. వీటిలోనూ మహిళలు పోటీ పడడానికి సమాన అవకాశాలున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సారి మెజారిటీ పంచాయతీల్లో మహిళలే మహరాణులు కాబోతున్నారనేది స్పష్టమవుతోంది.
వారిదే మెజారిటీ...
ఎలాంటి పదవులైనా సరే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వాదన. గ్రామ పంచాయతీల్లోనూ దీనిని అవలంభిస్తే పాలన స్థితిగతులు మారతాయని ప్రభుత్వం కూడా భావించింది. సామాజిక వర్గాలవారీగా ఇచ్చిన రిజర్వేషన్లలో సగం మహిళలకే దక్కేలా ఏర్పాట్లు చేశారు. దానికి అనుగుణంగానే 50 శాతం సర్పంచ్ పదవులు మహిళలకే దక్కనున్నాయి.
ఇదీ చదవండి: ప్రథమ పౌర..సేవా ధీర