శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన గ్రామ వాలంటీర్ రెయ్యి లలిత (28) అనారోగ్యంతో మృతి చెందారు. ఈనెల 5న ఆమె పలాస తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవిడ్ టీకా వేసుకున్నారు. ఆ రాత్రి జ్వరం వచ్చింది. శనివారం రాత్రికి ఎక్కువవడంతో మాత్రలు వేసుకున్నా తగ్గకపోగా స్పృహ కోల్పోయింది. ఆదివారం ఉదయం కాశీబుగ్గలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి విషయాన్ని అధికారులకు వివరించారు. తహసీల్దార్ మధుసూదన్‌తో పాటు వైద్యులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లలిత భర్త వాసు కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.
మూడు నెలల క్రితం గ్రామంలో వాలంటీర్ పోస్టు ఖాళీ అవడంతో లలితను నియమించామని ఎంపీడీవో తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక లలిత మరణంపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. వాలంటీర్ లలిత మృతి బాధాకరమని పశుసంవర్ధక శాఖ మంత్రి ఎస్.అప్పలరాజు పేర్కొన్నారు. పలాస ప్రభుత్వాసుపత్రిలో వాలంటీర్ మృతదేహాన్ని ఆదివారం పరిశీలించారు. కొవిడ్ నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తోందని అందరిలానే లలిత తీసుకున్నారని చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే మృతిచెందిందా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో జిల్లా కేంద్రం నుంచి ఫోరెన్సిక్ వైద్యుడు రాజీవ్ వర్మను పిలిపించి పోస్టుమార్టం చేయిస్తున్నట్లు తెలిపారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. తక్షణసాయంగా రూ.2లక్షలు అందజేస్తామన్నారు. వాలంటీర్‌కు ఇచ్చిన వ్యాక్సిన్ బ్యాచ్ టీకాను నిలిపివేశామని.. ఇప్పటికే 79 మంది తీసుకున్నారని, వారిని వారంపాటు పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: శ్రీశైలం సమీపంలో ఆటో బోల్తా... ఒకరు మృతి