POWER CUT: రాష్ట్రంలోని పట్టణాల్లో విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారు. మండే ఎండలకు విద్యుత్తు కోతలు తోడవటంతో మున్సిపాలిటీల్లో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. లోడ్ రిలీఫ్ పేరుతో రెండు వారాల కిందట కోతలతో విసిగిపోయిన జనం మళ్లీ అవే అవస్థలతో గగ్గోలు పెడుతున్నారు. అర్ధ గంట, గంట విద్యుత్తు కోతలు విధిస్తామని డిస్కంలు చెప్పినా అందుకు భిన్నంగా బుధవారం రాత్రి కొన్ని మునిసిపాలిటీల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
శ్రీకాకుళం జిల్లా అంతటా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. శ్రీకాకుళం నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కరెంటు సరఫరా నిలిపేసి... జిల్లాలో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో అప్రకటిత విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు నానాపాట్లు పడ్డారు. రోగులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండడంతో... విద్యుత్ శాఖ సిబ్బంది సైతం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఓ వైపు విద్యుత్ కోతలు.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఉదయం నుంచి రాత్రి 10.40 గంటల వరకు పలు దఫాలుగా విద్యుత్తు కోతలు విధించారు. నల్లమల అడవికి దిగువన ఉన్న పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి అడవి జంతువుల సంచారం ఉంటుంది. దీంతో కరెంటు కోతలు విధించేసరికి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.
* తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరిపేటలో నాలుగు గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచింది.
* అమలాపురంలో సాయంత్రం రెండు గంటలపాటు విద్యుత్తు లేదు.
* తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.15 గంటలు కోతలు విధించారు.
* కాకినాడ జిల్లా పిఠాపురంలో అర్ధరాత్రి 11.30 నుంచి విద్యుతు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా అరకులోయ ప్రభుత్వ ప్రాంతీయ వైద్య కేంద్రంలో విద్యుత్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వైద్య కేంద్రంలోని రోగులు సిబ్బంది సెల్ఫోన్ లైట్ల వెలుగులోనే గడిపారు. వైద్య కేంద్రంలో జనరేటర్ సౌకర్యం ఉన్నప్పటికీ... దాన్ని ఆన్ చేసేందుకు సిబ్బంది లేకపోవడం విశేషం. దీంతో రోగులతో పాటు సిబ్బంది అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నేడు తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం