రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.. అయినా ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈ లీక్‌లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. మొదటిరోజు తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో రాగా.. రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చేసింది. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువెళ్లేందుకు అవకాశమే లేదు. పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకెళ్లొద్దని చెప్పామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరి ప్రశ్నపత్రం ఎలా బయటకు వస్తుందంటే పాఠశాల విద్యా శాఖ దగ్గర సమాధానం లేదు. పైగా ఇదేదో మాస్‌కాపీయింగ్ అని.. ప్రశ్నపత్రం లీక్ కిందకు రాదంటూ సమర్థించుకునేలా వ్యవహరిస్తోంది. పరీక్ష రాసి వచ్చాక ప్రశ్నపత్రం లీకైందంటే తమ పరిస్థితి ఏంటి? కష్టపడి చదివింది వృథానా? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారు. ఇవేవీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
వరుసగా రెండు రోజులు అదే పరిస్థితా?
పరీక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మాత్రమే రావాల్సిన ప్రశ్నపత్రాలు గంటన్నరకే బయటకు వచ్చేస్తున్నాయి. దీన్ని అధికారులు ప్రశ్నపత్రం లీకుగా భావించకపోవచ్చు.. కానీ పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవ్యధకు గురికారా? పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. అధికారుల ప్రకటన ప్రకారమే 11 గంటలకు ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇవి బయటకు వచ్చిన తర్వాత ఇంకా 1.45 గంటల పరీక్ష సమయం ఉంటుంది. చూచిరాతలకు ఈ సమయం సరిపోదా? సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రాలు వస్తుంటే అవి ఎక్కణ్నుంచి వచ్చాయో గుర్తించకుండా ఎక్కడా లీక్ కాలేదని, మాల్‌ప్రాక్టీస్ జరగలేదని అధికార యంత్రాంగం వాదిస్తోంది. 9.30 గంటల తర్వాత ప్రశ్నపత్రాలు బయటకు వస్తే తప్పు లేదా?
ముందే తెరుస్తున్నారా?
కరోనా కారణంగా రెండేళ్లపాటు పదో తరగతి పరీక్షలే జరగలేదు. ఇప్పుడు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండానే వచ్చారు. దీనికితోడు 11 పేపర్ల స్థానంలో ఏడు పేపర్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు రోజుకో లీకు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 6.22 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లు, ఉంటారు. పోలీస్‌స్టేషన్‌కు 8కి.మీ.పైగా దూరంలో ఉండే కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తీసుకువెళ్లేందుకు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. కేంద్రాలకు తీసుకువెళ్లిన ప్రశ్నపత్రాలను పరీక్షకు 15 నిమిషాల ముందే (9.15 గంటలకు) తెరుస్తారు. చాలా చోట్ల 9గంటలకే ప్రశ్నపత్రాలను బయటకు తీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
లీక్ కాలేదు: మంత్రి బొత్స
పదో తరగతి ప్రశ్నపత్రాలు ఎక్కడా లీక్ కాలేదని, మాల్‌ప్రాక్టీస్ జరగలేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయాలని కుట్ర చేస్తున్నారు. తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఘటనలో నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్, ఎన్‌ఆర్‌ఐకు చెందిన ఉపాధ్యాయుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. ఎందుకు ఈ పేర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. తెదేపా, నారాయణలాంటివి ఎన్ని డ్రామాలు ఆడినా తప్పు జరిగితే టీవీల ముందుకు వచ్చి చెబుతాం. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండంలోని అంకిరెడ్డిపల్లె పాఠశాలలో ఉదయం 10 గంటల తర్వాత క్లర్క్ ఫొటో తీసి, ఉపాధ్యాయులకు పంపించి లబ్ధి పొందాలని చూశాడు. ఈ విషయాన్ని పసిగట్టి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఆపాం. పోలీసులకు ఫిర్యాదు చేశాం. నలుగుర్ని సస్పెండ్ చేశాం. గురువారం హిందీ ప్రశ్నపత్రం శ్రీకాకుళం జిల్లాలో లీకైనట్లు కొన్ని ఛానళ్లలో వస్తే విచారణ జరిపాం. అది తప్పని తేలింది. ఇప్పటి వరకు ప్రశ్నపత్రాలు లీకు కాలేదు’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్.. 10మంది ఉపాధ్యాయులు, సిబ్బందిపై కేసు