శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రంగాపురం గ్రామ ప్రజలది విచిత్ర పరిస్థితి. లింగాలవలస పంచాయతీలో ఉన్న ఈ గ్రామం నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామస్థులు ఓటు వేయడానికి సారవకోట మండలం వాండ్రాడ గ్రామానికి వెళ్తారు. అదే స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి ఆరుకిలోమీటర్ల పరిధిలోని లింగాలవలస చేరుకుని అక్కడ ఓటు వేస్తారు. రెండిళ్ల పూజారిలా తమ పరిస్థితి మారడం వల్ల గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
సిరుల పంట వారి సొంతం
చుట్టూ కొండలు... ఎటుచూసిన పంటపొలాలు. సాగునీటి సౌకర్యం లేకపోయినా రెక్కల కష్టానికి తోడుగా నేలబావుల్నే ఆధారంగా చేసుకుని ఇక్కడి వారు సిరులు పండిస్తున్నారు. ఏడాది పొడవునా కూరగాయలతో పాటు వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. 85 నివాస గృహాలు ఉన్న ఈ గ్రామంలో 18 మంది రక్షణ శాఖ ఉద్యోగులు ఉండటం విశేషం. జిల్లాలో కూరగాయల సాగుకు ప్రసిద్ధి చెందిన గ్రామాల్లో రంగాపురం ఒకటిగా నిలిచింది.
అల్లంత దూరానే..
పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. రెవెన్యూ అవసరాలకు సారవకోట మండలం వెళ్లాలి. పంచాయతీ సంబంధిత కార్యకలాపాలకు టెక్కలి చేరుకోవాలి. ఒకేసారి ఒకేచోట పని ముగించుకునే పరిస్థితి లేదు. గ్రామంలో సమస్యల విన్నపానికి శాసనసభ్యుని వద్దకు వెళ్తే పంచాయతీలో పనిచేయించుకోండని చెబుతారు. పంచాయతీ పాలకుల వద్దకు వెళ్తే శాసనసభ్యునితో జరుగుతుందేమో ప్రయత్నించండని సూచిస్తారు. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి: