Idheam karma Mana Rasthraniki: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చంగుడులో నిర్వహించిన కార్యక్రమానికి.. ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అందరికీ మేలు చేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. మహేంద్రతనయ ఉప్పొంగి గ్రామంలోకి నీళ్లు రాకుండా కరకట్టలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సహజ వనరులను వైసీపీ నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు పెరిగి అల్లాడుతున్నామని మహిళలు ఆయనకు తెలియజేశారు. పోడూరు మండలం వేడంగిపాలెం, కొమ్ముచిక్కాల, పాలకొల్లు మండలం లంకలకోడేరులో చేపట్టిన "ఇదేం ఖర్మ" కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ధాన్యం ట్రాక్టర్లు రోడ్ల పక్కన బారులుతీరి ఉండటాన్ని గమనించి.. రైతుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జనం సొమ్ముతో జగన్ సకల భోగాలు అనుభవిస్తున్నారని.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేడ్కర్ కాలనీలో జరిగిన "ఇదేం ఖర్మ" కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఐదో వార్డులో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య.. మహిళల కష్టాలు ఆలకించారు. కర్నూలు జిల్లా పాణ్యం 21వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల వద్దకు వెళ్లారు. జగన్ పాలనలో అభివృద్ధి లేక నిరుద్యోగం ఎక్కువైందని.. ఉన్న పరిశ్రమలనూ పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీను సాగనంపాలని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి: