Students Suffering Due to Lack of Facilities in Bobbilipet Primary School: నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నాం. ప్రైవేటు బడులకంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్నమని ప్రభుత్వం తరచూ చెప్తుంటుంది. అదంతా మాటలకే కాని చేతల్లో కాదని ప్రభుత్వ పాఠశాలలే రుజువు చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా దర్శనమిస్తున్నాయి. నాడు- నేడు పథకంలో భాగంగా కొన్ని పాఠశాలనే అభివృద్ధి చేసి చేతులు దులుపుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలో బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట ప్రాథమిక పాఠశాలలో కనీసవసతులు లేక విద్యార్థులు అల్లాడుతున్నారు.
'నాడు - నేడు' నిధులు స్వాహా - పనులు చేయకుండానే ప్రధానోపాధ్యాయుడి చేతివాటం
ఆమదాలవలస మండలం బొబ్బిలి పేట ప్రాథమిక పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు చిన్న గదిలో అది కూడా వెలుతురు లేని గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల నిర్మించి సుమారు 40 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతున్నాయి. ఈ పాఠశాల గోడల లోపల ఇటుకలన్నీ బయటకు కనిపిస్తూ కూలిపోతుందో అన్న పరిస్థితిలో ఉంది. తరగతుల నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనం కూడా ఆ చిన్నగదిలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలానే పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి మురుగు దర్శనమిస్తోంది. ఒకే గదిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధించాలి వర్షం వచ్చిందంటే స్కూల్ సెలవే లేదా పక్కనున్న పంచాయతీ భవనంలో తరగతులు నిర్వహిస్తారని విద్యార్థులు చెప్తున్నారు.
పాఠశాల శిథిలావస్థకు చేరడంతో పిల్లలకు ఏం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో 60 మంది విద్యార్థులు ఉండేవారిని ప్రస్తుతం సగం కంటే తక్కువకు పడిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. తక్షణమే ప్రభుత్వం నాడు- నేడు పథకంలో భాగంగా నూతన పాఠశాల భవనాలను నిర్మించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
Nadu-Nedu: 'వైసీపీ ప్రభుత్వ ప్రచారాల కోసమే నాడు-నేడు'.. పాఠశాలలు ప్రారంభమైనా.. పూర్తికాని పనులు
మా స్కూల్లో వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా భోజనం తినే సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు మరుగుదొడ్లు కూడా లేవు. ముందు గర్ల్ వెళ్లిన తరువాత బాయ్స్ అందరం వెళ్తున్నాం. ఈ భవనం చాలా పాతది. ఎప్పడు పడిపోతుందో అని చాలా భయంగా ఉంది. అలానే కూర్చోవడానికి కూడా మాకు బెంచీలు లేవు.- కిరణ్, విద్యార్థి
ఈ గ్రామంలో ప్రాధానంగా ఉన్న పాఠశాల ఇది. ఈ భవనం నిర్మించి 40 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ భవనం చాలా శిధిలావస్థకు చేరింది. ఎప్పడెప్పుడు కూలిపోతుందో అని అందరం భయంతో ఉన్నాం. అందువల్ల తల్లీతండ్రులు పిల్లలను ప్రెవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. స్కూల్లో పిల్లలు చామా మంది ఉండేవారు కాని ఇప్పుడు చాలా మంది మానేసి కాన్వెంట్లకు వెళ్లిపోతున్నారు.- చింతాడ అప్పారావు, బొబ్బిలిపేట