మలి సంధ్యలో కరోనా సోకినా ఆందోళన చెందకుండా పోరాడారు ఈ వృద్ధ యోధులు. ప్రమాదకరమని తెలిసినా మానసికంగా కుంగిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను చవి చూసిన వీరు ఈ క్లిష్ట పరిస్థితుల్లోను సవాలుగా స్వీకరించారు. స్థైర్యంగా చికిత్స తీసుకొని కరోనాను జయించారు. తమ ధైర్యమే శ్రీరామరక్షగా నిలిచిందని చెబుతున్నారు. కరోనా బారినపడిన వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం.
శ్రీకాకుళం జిల్లాలో నమోదైన 40 వేల కేసుల్లో 25 శాతం మంది 60 నుంచి 80 ఏళ్ల పైబడినవారే. కొవిడ్ ఆసుపత్రి జెమ్స్, పభుత్వ సర్వజన ఆసుపత్రిలో వృద్ధులు ఎక్కువగా చికిత్స పొందుతున్నారని అక్కడి సిబ్బంది తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది త్వరగా కోలుకొని సురక్షితంగా ఇళ్లకు వెళుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ధైర్యం అవసరం..
"వృద్ధుల పాలిట ప్రాణాంతకంగా మారిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలి అంటే ధైర్యం చాలా అవసరం. అలా ధైర్యం చెప్పే కుటుంబసభ్యులుంటే మహమ్మారిని సగం జయించినట్లే. 86 ఏళ్లు పైడినా నేను ప్రతిరోజు ఆరోగ్య నియమాలను పాటిస్తున్నాను. బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా. నాకు మంచి ఆహారం అందించే కుటుంబ సభ్యులు దొరకడం నా అదృష్టం. ముఖ్యంగా వృద్ధులు నాలా ధైర్యంగా ఉండాలి. నేను ఇప్పటికీ ప్రతిరోజు నడక, వ్యాయామం చేస్తూనే ఉన్నాను. కరోనా బారిన పడి తక్కువ సమయంలో ఆసుపత్రి నుంచి బయటకు వచ్ఛా"
- తమిరి జనార్దనరావు, కిళ్లాం, నరసన్నపేట
నా భర్త సహకారంతో...
"నా వయస్సు 62 సంవత్సరాలు. నెలరోజుల క్రితం కరోనా బారిన పడ్డాను. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లారు. ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ధైర్యంగా ఉండు..నేనున్నాను అంటూ నిత్యం నా భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో కోలుకున్నాను. అక్కడి వారిచ్చిన ఆహారంతో పాటు మా వారు అందించిన సహకారం ఆదుకుంది".
- రత్నాల పద్మావతి, కొత్తపల్లి, కోటబొమ్మాళి
ఒంటరితనం తోనే ఇబ్బంది...
నా వయస్సు 76 సంవత్సరాలు. జ్వరంతో పాటు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురయ్యాయి. పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాను. ప్రాణవాయువు స్థాయి ఎప్పటికప్పుడు తగ్గుతుండటంతో మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం పంపించారు. ఒంటరితనంతో ఇబ్బందులు పడ్డాను. 26 రోజులపాటు ఆసుపత్రిలో ఉండి..కరోనా ను ధైర్యంగా ఎదుర్కొన్నా.
- వై.సూర్యనారాయణ, పెద్దమల్లిపురం, పాతపట్నం
హోం క్వారంటైన్‌లో 28 రోజులు...
కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాను. నా వయస్సు 70 ఏళ్లు. కరోనా సోకడంతో హోం క్వారంటైన్‌లో 28 రోజులు ఉన్నా. నా భార్య నన్ను కాపాడుకుంది. వేళకు మంచి పౌష్టికాహారం, మందులు అందించింది. రోజూ ఆవిరిపట్టుకోవడం, కషాయం వంటివి తాగాను. భయపడకుండా ధైర్యంగా ఉండటంతో కరోనా నుంచి బయట పడ్ఢా
- తూలుగు రామ్మూర్తి, సారవకోట
భగవంతునిపై భారం వేశా...
నా వయస్సు 80 సంవత్సరాలు. కరోనా సోకడంతో వైద్యుల సూచన మేరకు జెమ్స్ ఆసుపత్రిలో చేరా. కుటుంబసభ్యులను దగ్గరకు రానీ లేదు. మాది నిరుపేద కుటుంబం. భగవంతుని పై భారం వేసి గడిపా. 21 రోజుల చికిత్స అనంతరం ఇంటికి పంపారు. నా మనోధైర్యమే నన్ను కాపాడింది. - బి.అప్పన్న, శ్రీకాకుళం
ఒంటరిగా ఉన్నా భయపడలేదు...
నా వయస్సు 71. కరోనా రావడంతో కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఏమి చేయలేని నిస్సహాయస్థితి. జెమ్స్ ఆసుపత్రిలో చేరా. వైద్యుల చికిత్స తో బయట పడ్ఢా ఒంటరిగా ఉన్నా భయపడలేదు. వైద్యుల సూచనలు పాటిస్తూ, పోషకాహారం తీసుకుంటూ మహమ్మారిని జయించాను. - త్రినాథ్ సాహూ, శ్రీకాకుళం
నిర్లక్ష్యం తగదు...
60 ఏళ్లు దాటినవారు ఎక్కువ మందికి మధుమేహం ఉంటుంది. వీరు కూడా క్రమం తప్పకుండా కొవిడ్ నివారణ మందులు వేసుకోవడంతో పాటు ఇన్సులిన్ తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఏమాత్రం జ్వరం, ఆకలి మందగించడం. తలనొప్పి, దగ్గు ఉన్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. లేదంటే ప్రాణాంతకం అవుతుంది. వృద్ధుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు శ్రద్ధ వహించాలి. - డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, కార్డియాలజిస్ట్
పోషకాహారం తీసుకోవాలి...
వృద్ధులు పోషకాహారం తీసుకోవాలి. జర్వ లక్షణాలు కనిపించగానే ఆసుపత్రికి వెళ్లాలి. సర్వజన ఆసుపత్రికి వచ్చే కొంత ుంది వృద్ధులు తమకేమీ లేదని కుటుంబ సభ్యులు హడావిడి చేస్తున్నారని చెబుతారు. హఠాత్తుగా మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. దీనికి కారణం ఊపిరితిత్తులు పాడవ్వడం, కిడ్నీ, గుండె తదితర వ్యాధులతో బాధపడేవారే ఎక్కువ. అజాగ్రత్తగా ఉండటమే ఊపిరితిత్తులు పాడైన వారిలో వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వృద్ధులకు వారి శరీర ధర్మాన్ని పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం ఉన్న వారు ఆపిల్, అరటి పండు తినకుండా మిగతా పండ్లు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాయామం చేయాలి. - డాక్టర్ సునీల్‌నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఇదీ చదవండి: