YSRCP Support for Three Capitals: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మూడు రాజధానులకు మద్దతుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. విశాఖ రాజధాని కోసం అవసరమైతే మాలాంటి వాళ్లు ప్రాణ త్యాగాలకైనా వెనుకాడమని అన్నారు. ప్రతి ఒక్కరూ మూడు రాజధానుల నిర్మాణం కోసం ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల కోసం విద్యావంతులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నామని సహకరించాలని కోరారు.
మా ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా.. కోరికలను తీర్చకుండా పేదరికంలో గడపమని న్యాయమూర్తులు ఎన్నాళ్లు శాసిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్న సమయంలో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఇటువంటి సమావేశాలు నిర్వహించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సమావేశాలు నిర్వహిస్తే.. అధ్యాపకులు ఏ విధంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ సభకు బూర్జ మండలం ఓబిపేట నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చారు. అయితే ఆ బస్సు పాఠశాల మైదానంలో కూరుకుపోయింది. ఆ విద్యార్థులను వేరే బస్సులో తిరిగి పాఠశాలకు పంపించారు.
ఇవీ చదవండి: