ప్రజలు ఇచ్చిన అధికారంతో ఏర్పడిన శాసనసభకు సర్వాధికారాలు ఉంటాయని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాసుదేవపట్నంలో నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ప్రజల ఓట్లతో గెలిచిన సభ్యులు ఉన్న శాసనసభకు అన్ని అధికారాలు ఉంటాయన్నారు. శాసనసభ సృష్టించిన ఎగువసభకు సూచనలు చేసే హక్కు తప్ప.. శాసనసభను ఎదిరించే అధికారం లేదన్నారు.
'ఏ విషయంలోనైనా శాసనసభ తీసుకునే నిర్ణయమే ఫైనల్. కాకపోతే ఎగువసభకు సూచనలు, సలహాలు ఇచ్చే హక్కుంది. అంతేకానీ శాసన సభ తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునే అధికారం లేదు. అది పెద్దల సభ. అక్కడున్న వారందరూ మేధావులు కాబట్టి గౌరవసూచకంగా బిల్లులను అక్కడికి పంపిస్తాం. అయితే ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవడం ద్వారా వారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు' -తమ్మినేని సీతారాం, సభాపతి
ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకునే అధికారం మండలికి లేదని ఉద్ఘాటించారు. పింఛన్లు, జీతభత్యాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికోసం మనీ బిల్లు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. శాసనసభ తీసుకునే నిర్ణయాలే అంతిమమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...