శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన ట్రిపుల్ ఐటీకి భవనాల కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో జిల్లాలో 2016-17 సంవత్సరంలోనే నిర్మాణ పనులు, తొలిబ్యాచ్ విద్యార్థులను తీసుకున్నా ఇప్పటివరకూ భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో తరగతుల నిర్వహణ, విద్యార్థులకు వసతి కల్పన సమస్యగా మారింది. ఈ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయిదు బ్యాచ్‌లు నడుస్తున్నా కేవలం రెండింటికి సరిపడా వసతి, బోధన భవనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో సమీపంలోని ప్రైవేటు విద్యా సంస్థలు, దూరంగా ఉన్న మరో క్యాంపస్‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడి విద్యార్థులను అక్కడికి పంపించి చదువు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది.
పునాదుల దశలోనే భవన నిర్మాణాలు..
ఎచ్చెర్లలోని షేక్ మహ్మద్‌పురంలో 2016-17 విద్యా సంవత్సరంలో ట్రిపుల్ ఐటీ స్థాపించారు. అదే ఏడాది తొలి బ్యాచ్ ప్రారంభించారు. తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో నూజివీడులోని క్యాంపస్‌కు ఇక్కడి విద్యార్థులను పంపించారు. అప్పట్లో మూడు బ్లాకులు నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏటా కొత్త బ్యాచ్ వస్తున్న దరిమిలా మొత్తం ఆరు బ్యాచ్‌లకు సరిపడేలా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. కానీ అనుకున్నంత వేగంగా పనులు ముందుకు సాగలేదు. బిల్లులు రాకపోవడం, నిర్మాణ సామగ్రి లభించకపోవడం వంటి కారణాలతో నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
దూరాభారం తప్పడం లేదు
"మా కుమారుడు ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నా భర్త లేరు. దీంతో దగ్గరగా ఉంటుందని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఎంచుకున్నాం. వసతుల్లేక నూజివీడు పంపించారు. చివరి మూడు సంవత్సరాలైనా ఇక్కడకొచ్చి చదువుకుంటాడని ఆశించాను. ఇప్పటికీ అక్కడికే వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఎలా చదువుతున్నాడు..ఎలా ఉన్నాడు..అని ఆరా తీద్దామన్నా, నెలకోసారి వెళ్లి చూసొద్దామనుకున్నా వ్యయ ప్రయాసలు తప్పడం లేదు."
- ఓ విద్యార్థి తల్లి ఆవేదన
వేధిస్తున్న ఇసుక గండం..
కొత్తగా 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 48 తరగతి గదులు, 9 ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 3 దశల్లో మరో బ్లాకు నిర్మాణం చేపట్టారు. రూ.66.7 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 2022 డిసెంబరు నాటికి పూర్తిచేయాలి. ప్రారంభించి నాలుగు నెలలు గడిచినా పునాదుల స్థాయి కూడా దాటలేదు. ఇసుక కొరత వేధిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ ప్రదేశంలో టన్ను ఇసుక కూడా సిద్ధంగా లేదు. వాస్తవానికి వీరికి ఇసుక రేవు కేటాయించాల్సి ఉన్నా అది జరగలేదు. గుత్తేదారుడు, అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ సమస్య తలెత్తింది. నదుల్లో వరద ప్రవాహం కారణంగా ఇప్పట్లో ఇసుక దొరికే పరిస్థితి లేదు. ట్రిఫుల్ ఐటీలో పూర్తి కాని వసతి, బోధన భవనాలు ప్రస్తుతం శ్రీకాకుళంలో పీయూసీ-1, 2 విద్యార్థులు సుమారు 2,100 మంది విద్యనభ్యసిస్తున్నారు.
'వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నాం'
ప్రస్తుతం పీయూసీ-2 విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో ఉన్నారు. బాలికల్ని క్యాంపస్‌లోనే ఉంచాం. అబ్బాయిల్ని దగ్గరలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఉంచి అక్కడే వసతి, భోజన, బోధన సౌకర్యాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. మిగిలిన వారంతా నూజివీడులో చదువుతున్నారు. భవన నిర్మాణాలు కొవిడ్ వల్ల ఆలస్యమయ్యాయి. త్వరలో వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. ఇంజినీరింగ్‌లో కనీసం ఒక బ్యాచ్ విద్యార్థులనైనా ఈ ఏడాది ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వేగంగా భవనాలను అప్పగించాలని గుత్తేదారులను కోరుతున్నాం.
- పి.జగదీశ్వరరావు, డైరెక్టర్, ఐఐఐటీ, శ్రీకాకుళం
సకాలంలో రాని బిల్లులు..
జీ+2 గా ఉన్న మూడు బ్లాకుల్ని జీ+5గా చేసేందుకు మూడు అంతస్తుల చొప్పున నిర్మాణాలు ప్రారంభ మయ్యాయి. రూ.49.12 కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. ఇప్పటికి దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం రూ.25 కోట్లలో గుత్తేదారుడు ఇప్పటివరకూ రూ.16 కోట్లకు బిల్లులు పెట్టారు. కానీ దాదాపు రూ.3 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. ఈ జాప్యం విద్యార్థులకు శాపంగా మారింది.
ఇదీ చదవండి: Govt. Schools : ప్రభుత్వ పాఠశాలల్లో కుళ్లిన గుడ్లు, భోజనం..