శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర నదిలో ప్రవాహం పెరిగింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పాతపట్నం నుంచి గోపాలపురానికి వెళ్లే కాజ్వేపై నీరు చేరింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు రైలు వంతెనపై నుంచి ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు.
ఇచ్చాపురంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి. కొండ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి పెరిగిన వరదకు పాతశాసనం, మాశాఖపురం, జగన్నాధపురం, తేలుకుంచి, డొంకూరు, బుజ్జిపాడు పరిధిలో పంటపొలాలు నీటమునిగాయి. వరి పొట్ట దశలో ఉండటంతో... ఈ వరదకు పంట ఏమైపోతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు... మడ్డువలస ప్రాజెక్టు నిండింది. ఈ జలాశయం నుంచి 7గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సమీపంలో ఉన్న వంగర మండలంలోని గీతనాపల్లి, కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలతో పాటు... పంట పొలాలు నీట మునిగాయి.
ఇవీ చదవండి... భారీవర్షాలు... సాయం కోసం ప్రజల ఎదురుచూపులు