శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల ప్రజలు ఆందోళన బాట పట్టారు. మఖరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం సంత వద్ద ప్రజలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్లైఓవర్ బ్రిడ్జి లేక.. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంత జరిగే ఆదివారం రద్దీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని వివరించారు. కవిటి, కంచిలి మండలంలో ఉండే చాలా గ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అని అందుకే ఇక్కడ ప్లైఓవర్ అవసరమని నినదించారు.
ప్రస్తుతం రోడ్డు విస్తరణ జరుగుతున్నందున ప్లైఓవర్ నిర్మించకుంటే ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.