Old Women Reply to MLA: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌కు గడప గడపకు కార్యక్రమంలో వరుస షాకులు తగిలాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడాం మండలం జగన్నాథవలస సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేస్తున్న సమయంలో.. మా గ్రామానికి సరైన రోడ్లు లేవు.. త్రాగునీరు సౌకర్యం లేదు.. సీసీ కాలువలు లేవంటూ, గ్రామస్థులు చిట్టా విప్పారు. చివరికి ఇల్లు కూడా మంజూరు చేయడం లేదంటూ గ్రామస్థులు మొరపెట్టుకోవడంతో.. వారిని సముదాయించే పని చేశారు ఎమ్మెల్యే.
రహదారి నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే చెప్పారు. అయినాసరే గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో.. అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఇదే పంచాయతీలో వెంకయ్యపేట కాలనీలో ఓ వృద్ధురాలు సంక్షేమ పథకాలు గురించి అడిగారు. అనంతరం సీఎం జగన్‌కి ఓటేయాలని ఎమ్మెల్యే కోరగా.. సైకిల్ గుర్తుకే ఓటు వేస్తానని ఆమె చెప్పడంతో.. ఒక్కసారిగా అవాక్కైన ఎమ్మెల్యే అక్కడినుంచి వెనుతిరిగారు. అసలు దీనంతటికి వాలంటీర్లే కారణమంటూ.. ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పని చేయాలనుకుంటే చేయండి.. లేకపోతే ఇంటి వద్ద ఉండండి అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: