Smart Meters For Agricultural Motors: "అగ్రికల్చర్‌కు కనెక్షన్‌కు మీటర్ల పెట్టాలని చెప్పి..ఆ రకంగా మన రాష్ట్రంలో దాదాపు 18లక్షల మంది రైతుల మోటార్లకు మీటార్లు పెట్టాలని ఆలోచన చేసి..ఓ పైలేట్ ప్రాజెక్ట్ మాదిరిగా శ్రీకాకుళం జిల్లాలో 28000 మీటర్లను పెట్టడం జరిగింది..అక్కడ చూస్తే దాదాపు 33.15శాతం ప్రభుత్వం చెల్లించే సబ్సిడీలో సేవింగ్స్ వస్తావున్నాయి.. ఈ విధంగా అన్ని జిల్లాల్లో చేస్తే ..10000కోట్లు రైతుల సబ్సిడీ కింద చెల్లిస్తున్నాము..దాదాపు మూడున్నర వెయ్యి కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుంది.." మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
స్మార్ట్‌మీటర్ల గురించి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్న గొప్పలు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇవే మాటలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని.. 30 శాతం విద్యుత్ ఆదా అయిందని అన్నారు. దీనివల్ల రైతులకు మెరుగైన విద్యుత్ అందుతుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పెద్దలు ఎందుకిలా ఆహా, ఓహో అంటున్నారా అని ఆరా తీస్తే.. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్న ప్రచారంగా తేలింది. స్మార్ట్‌మీటర్లు గొప్పగా పనిచేస్తాయని, వాటివల్ల అద్భుత ఫలితాలు వస్తాయని ప్రచారం చేస్తూ.. సంబంధిత కాంట్రాక్టులో సింహభాగాన్ని అస్మదీయుడికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టేందుకు పన్నిన పన్నాగమని అర్థమైపోయింది.
వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న మాటలన్నీ అబద్ధాలని.. ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్-పీ.ఈ.జీ తో శ్రీకాకుళం జిల్లాలో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంతో తేటతెల్లమైంది. అక్కడ కొద్దిసంఖ్యలో ఐ.ఆర్.డీ మీటర్లు ఏర్పాటుచేసి, ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిన అంశాల ఆధారంగా గాల్లో లెక్కలు వేసి.. రాష్ట్రమంతా 18.58 లక్షల స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేస్తామనడం ఎంత తెలివి తక్కువతనమో పీ.ఈ.జీ అధ్యయనం స్పష్టంచేసింది. వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు వల్ల తగ్గిన విద్యుత్ వినియోగం 15 నుంచి 20 శాతమేనని పేర్కొంది. ఎంత తగ్గినా... దాన్ని సబ్సిడీ లెక్కల్లోకి మార్చి రాయితీ ఇంత తగ్గిందని చెప్పలేమని స్పష్టంచేసింది. డిస్కంలు అంత తక్కువ వ్యవధిలో పంపిణీ నష్టాల్ని తగ్గించుకోవడం కష్టమని తేల్చిచెప్పింది. 36 శాతం నష్టాల్ని తగ్గించామనుకుని, దాని ఆధారంగా ఇంత పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తుందని లెక్కలు వేసుకోవడం సరికాదని కూడా.. పీ.ఈ.జీ నివేదిక విస్పష్టంగా తెలిపింది.
పీ.ఈ.జీ అధ్యయన నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది సెప్టెంబరులో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిస్కంలకు లేఖలు రాశారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 28 వేల మోటార్లకు ఐ.ఆర్.డీ మీటర్లు అమర్చి.. ఏడాదిలో రైతుల కోసం ప్రభుత్వం చెల్లించే రాయితీ మొత్తంలో 23 నుంచి 36శాతం ఆదా చేయగలిగామని లెక్కలు వేసి.. ఆ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 18.58 లక్షల స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థించుకోవాలనుకోవడం, వాటిపై పెట్టే సుమారు 6వేల 500 కోట్ల పెట్టుబడిని ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని చెప్పడం అసంబద్ధమని కుండబద్దలు కొట్టారు.
శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టు సమాచార నాణ్యతపై సందేహాలున్నట్లు తేల్చిచెప్పారు. అక్కడ 37శాతం మీటర్లలో విద్యుత్ వినియోగం సున్నాగా నమోదైందని.. అత్యధికశాతం విద్యుత్తును కొద్దిమందే వినియోగించారని గుర్తుచేశారు. దీన్నిబట్టి చూస్తే శ్రీకాకుళంలో మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ రాయితీ ఆదా అయిందని చెప్పడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పేర్కొన్నారు. పోనీ అన్ని మోటార్లకూ ఐ.ఆర్.డీ మీటర్లే పెడితే మొత్తం 870.40 కోట్లతో అయిపోతుందని, స్మార్ట్‌మీటర్లకు ప్రభుత్వం చేయాలనుకున్న ఖర్చు దీనికంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువని స్పష్టంచేశారు.
వ్యవసాయ పంప్ సెట్లు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టులో అనేక సమస్యలు వచ్చాయని పీ.ఈ.జీ గుర్తించింది. ప్రకృతి శక్తుల నుంచి మీటర్లను కాపాడటం కష్టమవుతోందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రమంతా వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడంపై నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. మరికొంత కాలం ఆగాలని స్పష్టంచేసింది. అక్కడ వ్యవస్థ గాడిన పడేవరకూ వేచి ఉండి, మరి కొన్నేళ్లు సమాచారం పరిశీలించాకే ఒక నిర్ణయానికి రావాలని పేర్కొంది. అలాగే ఐ.ఆర్.డీ మీటర్ల కంటే స్మార్ట్‌మీటర్లు సున్నితంగా ఉన్నందున.. మరిన్ని ఎక్కువ సమస్యలు వస్తాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డిస్కంలను అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో వ్యవసాయేతర విద్యుత్ మీటర్ల సమర్థత 95శాతం ఉంటే, శ్రీకాకుళం జిల్లాలో అమర్చిన మీటర్ల సమర్థత 55శాతం లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. ఏడాది కాలంలో మీటర్లు విఫలమవడం, కాలిపోవడం 12 నుంచి 21 శాతంగా నమోదైంది. పంప్ సెట్లు మారుమూల ప్రాంతాల్లో ఉండటం, నెట్‌వర్క్ లేకపోవడంతో స్మార్ట్‌మీటర్ల నుంచి సమాచార ప్రసారం సరిగ్గా జరగదని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్నారు. అప్పుడు మనుషులు వెళ్లి రీడింగ్ నమోదుచేయాల్సి ఉంటుదన్నారు. అలాంటప్పుడు స్మార్ట్‌మీటర్ల కంటే తక్కువ ఖర్చయ్యే ఐ.ఆర్.డీ మీటర్లను అమర్చుకోవడం మంచిదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో ఐ.ఆర్.డీ పోర్ట్ మీటర్, అనుబంధ పరికరాలకు 2వేల 583.30 రూపాయల చొప్పున ఖర్చయిందని గుర్తుచేశారు. ఆ లెక్కన 18.58 లక్షల మీటర్లకు 480.12 కోట్లు వ్యయం అవుతుందన్నారు. ఐదేళ్ల నిర్వహణకు మరో 390.3 కోట్లు అవుతుందనుకున్నా.. మొత్తం ప్రాజెక్టు వ్యయం 870.4 కోట్లేనన్న విషయం ప్రస్తావించారు. స్మార్ట్ మీటర్లకయ్యే ఖర్చు కంటే ఇది చాలా తక్కువని తెలిపారు.
పీ.ఈ.జీ సంస్థ తమ అధ్యయనంలో భాగంగా.. ఐదు రకాల మీటరింగ్ అవకాశాల్ని పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో నమూనా డీటీ మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానాన్ని తేలిగ్గా అమలుచేయొచ్చని.. కొద్దిపాటి అదనపు ఖర్చు, తక్కువ శ్రమతో సాధ్యమని తెలిపింది. రాష్ట్రంలో డీటీ ఆధారిత విధానం ఇప్పటికే ఉందని.. మరికొన్ని ప్రక్రియలు, శాంప్లింగ్ విధానంతో మీటర్ల డేటా నాణ్యత, మెథడాలజీని మెరుగపరచవచ్చని పేర్కొంది. ఏపీలో వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు అమర్చిన మీటర్ల సామర్థ్యం మెరుగ్గా ఉందని.. గంటగంటకూ డేటా ఎంట్రీ విధానాల్ని ఆటోమేషన్ చేయడం, 11 కేవీ లేదా అంతకంటే కిందిస్థాయిలో నష్టాల వాస్తవిక అంచనాల ద్వారా మెరుగైన ఫీడర్ ఆధారిత మీటరింగ్ విధానాన్ని అమల్లోకి తేవచ్చని తెలిపింది.
ఫీడర్ల సెపరేషన్ మెరుగ్గానే జరిగినందున.. ఫీడర్ మీటరింగ్ ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగం, నష్టాల్ని తేలిగ్గానే అంచనా వేయొచ్చని వివరించింది. అలాగే 67శాతం వ్యవసాయ పంపుసెట్లకు హెచ్.వీ.డీ.ఎస్ ల ద్వారా విద్యుత్ సరఫరా అవుతున్నందున.. డీటీ మీటరింగ్‌కి నాలుగోవంతు మీటర్లు సరిపోతాయని చెప్పింది. మీటర్ల లొకేషన్లు డిస్కంల నియంత్రణలో ఉండటం వల్ల మొబైల్ డేటా సమస్యలు తగ్గుతాయని.. కావాలంటే అక్కడక్కడా కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టవచ్చని నివేదికలో పొందుపరిచింది. వినియోగదారుడి స్థాయిలో మదింపు చేయాలనుకుంటే, ప్రతి డీటీ వారీగా వినియోగాన్ని తీసుకుని లెక్క వేయవచ్చని తెలిపింద.
ఇవీ చదవండి: