శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస - కాశీబుగ్గ పురపాలికలతో పాటు పాలకొండ నగరపంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ మూడు పురపాలికల్లో 74 వార్డులుండగా.. నాలుగు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 70 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో సమస్యాత్మక, అతిసమస్యాత్మకంగా గుర్తించిన 75 కేంద్రాల్లో పటిష్ఠ భద్రతతో పాటు.. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
పలాస - కాశీబుగ్గ పరిధిలో ప్రశాంతంగా పోలింగ్..
పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించింది. ఇందిరా చౌక్ జంక్షన్లోని పోలింగ్ కేంద్రం, పలాస ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు తరలివచ్చారు. పలు చోట్ల వృద్ధులు పోలీసులు సహకారంతో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ జాగ్రత్తలు చేపట్టారు.
పాలకొండలో ప్రశాంతంగా పోలింగ్..
11 గంటల సమయానికి 21.79 శాతం పోలింగ్ నమోదైంది.18 ,14 , 15 పోలింగ్ కేంద్రాలను జేసీ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
జిల్లాలోని పాలకొండలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. పలు వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వరుస కట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇచ్చాపురంలో ఇలా..
ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికలు సంబంధించి 23 వార్డులకు గాను 36 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పటిదాకా పోలింగ్ 24. 25 శాతం పోలింగ్ నమోదైనట్లు కమిషనర్ రామలక్ష్మి వెల్లడించారు.
ఇవీ చూడండి... 'మీరు మమ్మల్ని బెదిరించినా సరే.. మాకు నచ్చిన వారికే ఓటేస్తాం'