HUMAN ORGANS DONATION : ఐఏఎస్ అవ్వాలని.. సమాజ సేవ చేయాలని కలలు కన్న కుమారుడు అకస్మాత్తుగా మరణిస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుదో ఊహించవచ్చు. అంతటి విషాదంలో ఉన్నా.. అందరిలా తమ కుమారుడిని సమాధి చేయకుండా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో కిరణ్ చంద్ అవయవాలను దానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కిరణ్ చంద్ అవయవాలను... తల్లిదండ్రులు దానం చేశారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కిరణ్ చంద్ ఆరోగ్యం క్షీణించడంతో... విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే కిరణ్ చంద్ బ్రెయిన్లో రక్తస్రావం అవ్వడంతో.. కోమాలోకి వెళ్లాడని డాక్టర్లు తెలిపారు. దీంతో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో... ఈనెల 16వ తేదీన చేర్పించారని.. పరిస్థితి విషమించడంతో... వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ధృవీకరించినట్లు పేర్కొన్నారు.
అనంతరం కిరణ్ చంద్ తల్లిదండ్రులు.. మోహన్ రావు, కళ్యాణి అవయవదానానికి అంగీకరించడంతో... గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు అవయవాలను పంపించేందుకు జెమ్స్ ఆసుపత్రి వర్గాలు ఏర్పాట్లు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా... జెమ్స్ ఆసుపత్రి నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయనగరానికి అవయవాలను తరలించామని వైద్యులు వివరించారు. కిరణ్ ప్రస్తుతానికి నిర్జీవి అయినా.. ఈ నిర్ణయంతో ఇతరుల్లో సజీవంగానే ఉంటారని ఆసుపత్రి వారు కిరణ్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
మోహన్ రావు, కళ్యాణి తమ కుమారుడిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నా కూడా అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఆ అవయవదానం కోసం మేము ఏపీ జీవన్ దాన్ని సంప్రదించాము. వారి సూచనల మేరకు జెమ్స్ ఆసుపత్రిలో అవయవాలను తీసి మాకున్న వసతిలో జిల్లా కలెక్టర్, పోలీసు వారి సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా అవసరమైన ప్రాంతాలకు తరలించాం. ఈ సాహసోపేతమైన నిర్ణయంతో మరికొంత మంది కుటుంబాల్లో వెలుగులు నింపేలా చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.- డాక్టర్ శ్రీనివాస్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, జెమ్స్ ఆసుపత్రి
కిరణ్ చంద్ మంచి బ్రిలియంట్ ..అలాంటోన్ని కోల్పోవలసి వస్తుందని అనుకోలేదు. నేను తనను ఐఏఎస్ చేయాలని.. వాళ్ల నాన్న సాఫ్ట్‌వేర్‌గా చూడాలనుకున్నారు. మా కొడుకుని ఐఏఎస్ చదివించాలనే లక్ష్యంతోనే పెంచాను. పదో తరగతి అయ్యాక దిల్లీలో చదివించి ఈ దేశానికి సేవ చేసేలా తయారు చేద్దాం అనుకున్నా. అంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదు. కిరణ్ చంద్ స్వార్థంతో కాకుండా అందరూ బాగు పడాలనే ఆలోచనతో ఉండేవాడు. కిరణ్ తెలివి తేటలను చూసి పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తోటి పిల్లలు చాలా ఇష్టపడేవారు. -కళ్యాణి, కిరణ్ చంద్ తల్లి
ఇవీ చదవండి :