ప్రతి నాలుగు గ్రామ పంచాయతీలకూ ఒక రిటర్నింగ్ అధికారిని నియమించి అక్కడే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఉన్నతాధికారులు సైతం సమీక్షిస్తున్నారు. పార్టీలకతీతంగా జరిగే సమరమైనప్పటికీ ప్రధాన పార్టీల చుట్టే పల్లె రాజకీయాలు తిరుగుతున్నాయి. శుక్రవారం నామపత్రాలు స్వీకరణ ప్రారంభమైనా చాలాచోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తిస్థాయిలో జరగక ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఆశావహులను బుజ్జగించేందుకు కీలక నాయకులు యత్నిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాకపోవడంతో తక్కువ మందే నామినేషన్లు వేశారు. మరోపక్క సమర్పణకు ఆదివారం వరకూ గడువు ఉంది. మంచి గడియలు, ముహూర్తాల పరంగా శనివారం బాగుండటంతో ఎక్కువ మంది ఆరోజు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
* మెళియాపుట్టి మండలంలో అత్యధికంగా 29 సర్పంచి పదవులకు నామపత్రాలు దాఖలయ్యాయి.
* అత్యల్పంగా టెక్కలిలో కేవలం ఆరుగురు అభ్యర్థులే దాఖలు చేశారు.
* నాలుగు మండలాల్లో పదిలోపు నామినేషన్లు వేయగా, 20 లోపు మూడు మండలాల్లో వేశారు.
పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు..
నామినేషన్లు స్వీకరించే ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలు అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా భద్రత ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డీఎస్పీ నుంచి ఎస్పీ స్థాయి వరకూ పోలీసు ఉన్నతాధికారులు అంతా నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగడానికి తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
నేటి నుంచి ప్రచారం..!
నామపత్రాలు సమర్పించిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పోలింగ్‌కు తక్కువ సమయమే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే చర్యలు ప్రారంభించారు. మరోపక్క ఇంకా పత్రాలు సమర్పించని వారు సైతం పనిలోపనిగా గ్రామాల్లో ప్రచారాలకు శ్రీకారం చుట్టేస్తున్నారు. పోలింగ్ సమయానికి 44 గంటల ముందు వరకూ అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆ ఆఖరి 44 గంటలూ ప్రచారం చేయడానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుమతించదు. దీంతో అభ్యర్థులు ఉన్న సమయాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: