కరోనా బాధితులకు చికిత్స అందివ్వడంలో అలసత్వం వహించవద్దని టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కోవిడ్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినందున పలు వార్డులలోని వైద్య, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కరోనా బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడంతోపాటు ఉత్తమ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగుల లక్షణాలను నిశితంగా పరిశీలించి సరైన చికిత్స అందివ్వాలన్నారు. కరోనా వైరస్ సోకిన వారు ఏఒక్కరూ మరణించకుండా చూడవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలాగే సాధారణ విభాగంలో కూడా రోగులకు చికిత్స నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొవిడ్ కేర్ కేంద్రంలో 45 పడకల నాన్ ఐసీయూ విభాగం, 10 పడకల ఐసీయూ విభాగం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ లీలారాణి తెలిపారు. 5గురు వైద్యులు, 4గురు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కార్మికులతో షిఫ్టుల ప్రకారం విధులు నిర్వహించనున్నారని తెలిపారు. కోవిడ్ బాధితుల కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకొనేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా ఇద్దరు వైద్యులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, వైద్యులు పాల్గొన్నారు .
ఇదీ చూడండి. రాష్ట్రానికి 16 పోలీసు మెడల్స్..డీజీపీ అభినందనలు