మందస మండలంలోని శివారు గ్రామాల్లో ఒడిశా పోలీసులు గత వారం నుంచి హల్‌చల్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని ఓటేయవద్దని, ధిక్కరించి ఎవరైనా వెళితే కేసులు పెడతామని గిరిజనులను హెచ్చరిస్తున్నారు. సాబకోట పంచాయతీకి మాణిక్యపట్నం నుంచి నామినేషన్లు వేసిన వార్డు సభ్యులు సవర లక్ష్మి, సవర ద్రౌపతిలపై ఒత్తిడితెచ్చి వారిని ఉపసంహరింపజేశారు. ఆ క్రమంలో బుధవారం బుడార్శింగి పంచాయతీ పరిధిలో గుడ్డికోల గ్రామాన్ని ఒడిశా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు సందర్శించారు.
ఆంధ్రాలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్లొద్దని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పొందడం మాటెలా ఉన్నా.. రెండుచోట్ల ఓటరు కార్డులు ఉండడం నేరమన్నారు. అందువల్ల ఒక రాష్ట్రానికి చెందినవారిగానే వ్యవహరించాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు గ్రామంలో ఉంటామని ఒడిశా పోలీసులు తెలపడంతో ఆ గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: