గతేడాది మార్చి 23న జరగాల్సిన పురపాలక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పుడు తొలుత ఆరువారాలే వాయిదా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినా తర్వాత అనుకూల పరిస్థితులు కనిపించలేదు. కేసులు దాదాపు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తొలుత పంచాయతీ ఎన్నికలు నాలుగుదశల్లో నిర్వహిస్తున్నారు. వాటిలో ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. ఈనెల 21తో మిగిలినవి పూర్తి కానుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పురపోరుకు పచ్చజెండా ఊపింది. మార్చి 3 మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.
విరామం తర్వాత..
జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీకి మాత్రమే ఎన్నికలు నిర్వహించేందుకు 2020 మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది ఆయా పట్టణాల్లో మొత్తం 74 వార్డులు ఉన్నాయి. వాటన్నిటికీ కలిపి 336 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు. ఇందులో కొందరు మార్చి 3న ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. అదేరోజు ఏఏ వార్డులకు, ఎవరెవరు తలపడనున్నారో తేలిపోనుంది. దాదాపు 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు రావడంతో అభ్యర్థులంతా మళ్లీ ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు.
ఆ మూడు చోట్లా లేవు..
జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంఘం, రాజాం నగర పంచాయతీకి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. శ్రీకాకుళంలో కొత్తగా ఏడు గ్రామాలు విలీనం చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై కొందరు నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ప్రక్రియతో మండలంలో కనీసం ఒక్క పంచాయతీ అయినా ఎస్సీకి రిజర్వు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కారని అభ్యంతరం తెలుపుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. అది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
ఆమదాలవలసలో గతంలో 23 వార్డులుండేవి. తర్వాత 27గా పునర్విభజన చేశారు. అది సక్రమంగా లేదని, తప్పుల తడకలుగా చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది ఇంకా విచారణ దశలోనే ఉంది. దీంతో ఆ రెండు చోట్లా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాలేదు.
రాజాం నగర పంచాయతీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఆర్డినెన్సు జారీ చేసింది. పుర నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఆగిపోయిన చోట నుంచే ఎన్నికలను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఈసీ సోమవారం ఉత్తర్వులు ఇవ్వడంతో ఇచ్ఛాపురం, పలాస, పాలకొండల్లో మాత్రమే పోరు జరగనుంది.
ఇదీచదవండి.