ఆపదలో ఆదుకున్న అన్ననే... ఆస్తి కోసం అంతమొందించాడు. అన్నను చంపొద్దంటూ ప్రాధేయపడిన అక్కనూ కత్తితో నరికి చంపాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో సొంత అన్న, అక్కను.. తమ్ముడు రామకృష్ణ హత్య చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. స్థానికంగా ఉండే గొర్లె సన్యాసిరావు, జయమ్మ, రామకృష్ణ ఒకే తల్లి పిల్లలు. ఇటీవలే కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పరిహారం పంపిణీ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం తలెత్తింది. సమస్యను గ్రామ పెద్దల దృష్టిలో పెట్టినప్పటికీ గొడవ సద్దుమణగలేదు. ఈ తగాదా కాస్తా చినికిచినికి గాలివానలా మారి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సొంత బాబాయ్ చేసిన దారుణాన్ని చూసి సన్యాసిరావు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు.
పరిహారం పంపిణీకి అన్న అడ్డుపడుతున్నాడని భావించిన తమ్ముడు.. ఉదయం వేళ పశువుల కొట్టంలో ఉన్న అన్నను వెనక వైపు నుంచి వెళ్లి కత్తితో నరికి చంపాడు. అన్నను చంపేస్తున్నాడంటూ కేకలు వేసి అడ్డుకునేందుకు యత్నించిన అక్కనూ హత్య చేశాడు. జయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. సన్యాసిరావు ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యంలో ప్రాణాలొదిలాడు.
'మా నాన్న, అత్తను.. మా బాబాయి దారుణంగా నరికి చంపాడు. మేమంతా ఉదయం నిద్ర లేచే లోపే బయట పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ.. బయటకొచ్చేసరికి నాన్న, అత్త రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్తి కోసం మా బాబాయ్.. మా వాళ్లను దారుణంగా నరికి చంపాడు. ప్రాణాలతో పోరాడుతున్న మా నాన్నను ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేస్తే.. మా ఫోన్ కూడా తీసుకొని మాపై దాడి చేశాడు.' అంటూ సన్యాసిరావు కుమార్తెలు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి, అత్త లేకుంటే తమకు దిక్కెవరంటూ.. విలపిస్తున్న వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రంగంలోకి పోలీసులు
అన్న, చెల్లి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను క్లూస్ టీంతో పరిశీలించి పోస్ట్మార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు జె.ఆర్.పురం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్యపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ ఎం.మహేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి: ' క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పి.. రూ.3 లక్షలు కాజేశారు'