జగనన్న విద్యాకానుక ఇప్పటికే విద్యార్థుల చేతికి చేరాల్సి ఉన్నా వాయిదా పడుతూ వస్తోంది. అక్టోబరు 5న పాఠశాలలు తెరిచి వీటిని అందజేయాలని అధికారులు తొలుత భావించారు. కరోనా దృష్ట్యా నవంబరు 2న బడులు తెరవాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కానీ విద్యార్థులకు కానుక కిట్‌ను మాత్రం యథాతథంగా ఈనెల ఐదో తేదీనే అందించాలని నిర్దేశించింది. అయితే జిల్లాలో కానుకను పూర్తిస్థాయిలో అందించాలంటే ఇంకా లక్షల కొద్దీ రాత పుస్తకాలు రావాల్సి ఉంది. వేలల్లో సాక్సుల కొరత ఉంది. ఈనేపథ్యంలో అనుకున్న సమయానికి అందరికీ కిట్లు అందుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజాం
జిల్లాలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జగనన్న విద్యాకానుక కిట్లకు ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా కాక గతేడాది సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదించారు. దీంతో అందరికీ తొలివిడతలో విద్యాకానుక అందే పరిస్థితి లేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలో తొలివిడత పంపిణీకి 8.05 లక్షల నోటు పుస్తకాలు ఇంకా రావాలి. సాక్సులు కూడా వేలాదిగా రావాల్సి ఉంది. తొలుత సెప్టెంబరులో పంపిణీ చేస్తారని చెప్పటంతో ఆగస్టు నెలాఖరున కొన్ని వస్తువులను పాఠశాలలకు పంపారు. అది వాయిదా పడటంతో పంపిణీ నిలిచిపోయింది. ఇప్పుడు కొత్త తేదీ ప్రకటించడం, సమయం దగ్గర పడుతుండటంతో వస్తువులను పాఠశాలలకు ఆగమేఘాలపై పంపాల్సి ఉంది.
రాజాం నగర పంచాయతీ పరిధిలోని డోలపేట జడ్పీ పాఠశాలలో గతేడాది 555 మంది విద్యార్థులుండేవారు. ఈ ఏడాది ఇప్పటికే 603 మంది విద్యార్థులు చేరారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశముంది. గతంలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా కానుక వస్తువులను పంపిణీ చేయనుండటంతో అదనంగా చేరినవారికి అందకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
66 శాతం రాత పుస్తకాలు రావాలి ..
జగనన్న విద్యాకానుకకు సంబంధించి దాదాపు కిట్‌లో పొందుపరచాల్సిన వస్తువులన్నీ వచ్చినట్లే. 66 శాతం రాత పుస్తకాలు మాత్రం రావాల్సి ఉంది. ఇప్పటికే వచ్చినవి మండల కేంద్రాలకు అన్నీ చేరిపోయాయి. పాఠశాలలకు ఆగస్టులోనే చాలా వరకు పంపిణీ చేశాం. పంపిణీ నాటికి అందరికీ చేరువ చేస్తాం. పాఠశాలల్లో అదనంగా విద్యార్థులు ఉంటే ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. పిల్లలందరికీ కానుక అందించేందుకు కృషి చేస్తాం. - డి.మోహనరావు, సీఎంవో, సమగ్రశిక్ష, శ్రీకాకుళం
మొత్తం విద్యార్థులు: 2,49,405 (1-10 తరగతులు)
బాలురు: 1,19,362
బాలికలు: 1,30,043