పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులోనే కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజాం పట్టణంలోకి రాత్రి 8 గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి కళా వెంకటరావు నివాసాన్ని చుట్టుముట్టారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలిస్తుండగా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ఏం తప్పు చేశారని తీసుకెళుతున్నారని నిలదీశారు. రామతీర్థం ఘటనలో అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను బలవంతంగా పోలీసు జీపులోకి నెట్టేశారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 9.45 గంటలకు ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు.
కళాతో పాటు ఆయన పీఏ వెంకటనాయుడు, అనుచరుడు శంకరావును తీసుకెళ్లారు. చీపురుపల్లి, రాజాం ప్రాంతాల తెదేపా నేతలు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. కళాకు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు జారీ చేసి.. ఆయన్ను విచారించి రాత్రి 11.15 గంటల సమయంలో విడిచిపెట్టారు. రామతీర్థం ఘటనలో ప్రభుత్వం నిందితులను వదిలి, ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తోందని కళా వెంకటరావు ఆరోపించారు.
కళా వెంకటరావును అరెస్టు చేయలేదని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకే ఠాణాకు తీసుకొచ్చామన్నారు. ఇదే కేసులో నెల్లిమర్ల మండలానికి చెందిన తెలుగుదేశం నేత సువ్వాడ రవిశేఖర్‌తో సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయనగరం గ్రామీణ పోలీసు స్టేషన్లో ఉంచారు.
ఇదీ చదవండీ... ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానం.. ప్రారంభించనున్న సీఎం