గతంలో పింఛన్లు పొందుతున్నా.... 2019 సెప్టెంబర్ నుంచి 2019 డిసెంబర్ వరకు.... పింఛన్లు నిలిపేరంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామానికి చెందిన 175 మంది మహిళలు 2019 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లు అణగారిన వర్గానికి చెందిన వారని వారి తరపు న్యాయవాది వాదించారు. ఐదేళ్ల కిందటే అందరూ పింఛన్లకు... అర్హులుగా ఎంపికయ్యారని...రాజకీయ కారణాలతో సెప్టెంబర్ 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు పింఛన్లు నిలిపేశారని పింఛన్లు నిలిపేశారని వాదనలు వినిపించారు. వాస్తవాల్ని పరిశీలించకుండానే కొంత మందికి భూమి ఉందని, పిల్లలు ఉద్యోగం చేస్తున్నారన్న కారణంతో పింఛన్లు నిలిపేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. 175 మందిలో ఇద్దరు మాత్రమే పెన్షన్‌కు అర్హులని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం..కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ పథకాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసే ప్రభుత్వం..పిటిషనర్లకు ఇచ్చే కొద్దిపాటి పింఛన్ సొమ్మును నిలిపేయడం సరికాదని వ్యాఖ్యానించింది. వివిధ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసిన విషయం కోర్టుకు తెలుసని పేర్కొంది. ఏ వ్యక్తైనా ప్రభుత్వాన్ని గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం వేల కోట్లు ఖర్చుచేయమని కోరారా? అని ప్రశ్నించింది. క్రిస్మస్ కానుక కోసం...ఏ క్రైస్తవుడైనా అడిగారా! 'రంజాన్ తోఫా' కోసం ఏ ముస్లిం అయినా అభ్యర్థించారా ? అయినా వాటికోసం ప్రజాధనం నుంచి వేల కోట్లు ఖర్చుచేశారని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు ఓ రాజకీయ పార్టీ రంగుల్ని వేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విషయాన్ని ఎవరైనా మర్చిపోగలరా? అని వ్యాఖ్యానించింది. వివిధ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం..పిటిషనర్ల విషయంలో పింఛన్ సొమ్ము నిలిపేయడం సరికాదని స్పష్టం చేసింది. ఏకారణం చేతైనా పింఛన్ నిలిపేయాలంటే ఆ విషయాన్ని గ్రామ సభలో పెట్టాలని..అంతకుముందు వివరణ ఇచ్చేందుకు సంబంధిత లబ్ధిదారునికి నోటీసు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ప్రస్తుతవ్యాజ్యాల్లో ఆ తరహా విధానాన్ని అనుసరించ లేదని..అధికారుల చర్య సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
భారతీయ సంప్రదాయాల్లో వివాహానికి పవిత్రత ఉందని..భర్త బతికి ఉండగానే ఏ వివాహిత విధవరాలినని చెప్పుకోదని హైకోర్టు వ్యాఖ్యానించింది. భర్తతో కలిసి జీవిస్తూ తాను ఒంటరి మహిళనని ప్రకటించుకోదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకవేళ అలా చెప్పారని భావించినా..అందుకు పేదరికం, కుటుంబ పరిస్థితులే కారణమని పేర్కొంది. ఆ మహిళల దయనీయస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో పింఛను పథకాన్ని వర్తింపజేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ సూచించారు.