నీటి వనరులు పుష్కలంగా ఉన్నా శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటిఎద్దడి నెలకొంది. తాగునీరు లేక ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నారు. గొంతు తడిసేందుకు ఊటనీరే దిక్కని చెబుతున్నారు. నాగావళి, వంశధార నదుల్లోని ఊటబావుల నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు. సీతంపేట ఏజెన్సీలో దయనీయ పరిస్థితి నెలకొంది. నీటికోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి. ఆనపకాయలగూడలో ఏర్పాటు చేసిన గ్రావిటేషన్ ప్లో ద్వారా తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలూ చెప్పలేని తిప్పలు పడుతున్నారు. చెలమల నీరే వీరికి దిక్కయింది. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండ వేడికి... ఇసుక తెన్నెలపై పడరాని పాట్లు పడుతున్నారు. సరుబుజ్జిలి మండలం చిన్నవెంకటాపురం గ్రామస్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు పుష్కలంగా ఉన్నా... పనికిరాని పరిస్థితి. వంశధార నదిలోని నీటి కోసం వెళ్లాలంటే... రానుపోను 6 కిలోమీటర్ల నడవాలి. ఈ ఎండల్లో అంతదూరం నడవలేక గ్రామంలోని చెరువు నీటితోనే అవసరాలు తీర్చుకుంటున్నారు.
ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.